ముంబై, జూలై 9: ద్రవ్య విధానాన్ని మరింత కచ్చితత్వంతో ఆర్బీఐ 3 కీలక సర్వేలను గురువారం ప్రారంభించింది. ఇందులో ద్రవ్యోల్బణంపై కుటుంబస్తుల్లో ఉండే అంచనాలను తెలుసుకోవడం కూడా ఒకటి. స్థూలంగా చెప్పాలంటే ధరలు, ఆర్థిక పరిస్థితులు, ఉపాధి అంశాలపై ఈ అధ్యయనాలను ఆర్బీఐ చేపడుతున్నది. ఈ క్రమంలోనే కుటుంబాల ద్రవ్యోల్బణం అంచనాల సర్వే, గ్రామీణ వినియోగదారుల విశ్వాస సర్వే, నగర వినియోగదారుల విశ్వాస సర్వేలకు ఉపక్రమించింది. కుటుంబాల ద్రవ్యోల్బణం అంచనాల సర్వే దేశవ్యాప్తంగా 19 నగరాల్లో జరుగుతుందని ఓ ప్రకటనలో ఆర్బీఐ తెలిపింది.
గృహస్తుల వ్యక్తిగత వినియోగం ఆధారంగా ఈ సర్వేలో ధరల తీరుతెన్నులు, ద్రవ్యోల్బణంపై ఓ అంచనాకు రావడం జరుగుతుంది. 3 నెలల ప్రాతిపదికన కొన్ని రకాల ఉత్పత్తుల ధరలు, సాధారణ ధరలపై కుటుంబస్తుల అభిప్రాయాలను సేకరిస్తారు. ఇక సాధారణ ఆర్థిక పరిస్థితి, ఉపాధి అవకాశాలు, ధరల స్థితిగతులు, ఆదాయ-వ్యయాలపై గ్రామాలు, మోస్తరు పట్టణాల్లో గ్రామీణ వినియోగదారుల విశ్వాస సర్వే జరుగుతుంది.
దేశవ్యాప్తంగా ఉన్న 31 రాష్ర్టాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ సర్వే ఉంటుంది. ఇదే అంశాలపై నగరాల్లోని వినియోగదారుల నుంచీ సర్వే ద్వారా అభిప్రాయాలను తీసుకోనున్నారు. అయితే ఈ సర్వేను అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, ముంబై, తిరువనంతపురం సహా 19 నగరాల్లో నిర్వహించనున్నారు.