‘మూగజీవుల మనుగడ-మన బాధ్యత’ అంశంగా జిల్లాస్థాయిలో వివిధ రకాల పోటీలు జరుగుతున్నాయి. ఎంతోమంది పిల్లలు హాజరయ్యారు. ఉపన్యాసాల విభాగంలో..‘వినయ్, బైపీసీ సెకండ్ ఇయర్, సాంఘిక సంక్షేమ కళాశాల, నర్సంపేట, వరంగల్’ అన్న పిలుపుకి.. వినయ్ ఉత్సాహంతో సైన్స్ మాస్టారు వైపు చూశాడు. ‘బెస్ట్ ఆఫ్ లక్’ అని భుజం తట్టి.. అతనిలో మరింత విశ్వాసం నింపాడు మాస్టారు.వయసులో చిన్నవాడైనా వయసుకు మించి ఆలోచించే తత్వం వినయ్‌ది. అతను అడిగే కొన్ని ప్రశ్నలకు ఉపాధ్యాయులు కూడా ఆశ్చర్యపోవడంలో అతిశయోక్తి లేదు. తనే క్లాస్ ఫస్ట్. అందుచేత మాస్టారు పట్టుబట్టి, వారం రోజులుగా కష్టపడి అతన్ని పోటీకి సిద్ధం చేశాడు.వినయ్ మైక్ పట్టుకుని సభకి నమస్కరించి,
“సమస్త జీవరాశుల్లో మనిషి తెలివైనవాడు. అన్నిటిపైనా ఆధిపత్యాన్ని చెలాయిస్తూ చివరికి ఇతర ప్రాణుల జీవించే హక్కును హరిస్తున్నాడు. మనిషి చేస్తున్న తప్పుల భారాన్ని మూగజీవాలు మౌనంగా మోస్తున్నాయి!” అని మొదలుపెట్టి, సాధ్యమైనన్ని విషయాలను వివరించాడు. అతని మాటల్లో జీవుల మీద తనకున్న ప్రేమ కనిపిస్తోంది. న్యాయనిర్ణేతలు కన్నార్పకుండా వింటున్నారు.
“పుట్టిన ప్రతి జీవీ మరణించి మట్టిలో కలసిపోవాల్సిందే. ఆఖరికి మనల్ని కన్నవారైనా, మనం కన్నవారైనా సరే.. మరణిస్తే ఇంట్లో పెట్టుకుని పూజించలేం. ఎందుకనీ? దేహం క్రమంగా క్షీణించి కుళ్లిపోయి దుర్గంధాన్నిస్తుంది కాబట్టి. తర్వాత రోగాలు వ్యాపిస్తాయి. మనిషి తెలివిగా శవాన్ని చెత్తలో పడేయకుండా శ్మశానంలో ఖననం చేస్తాడు. మరి మిగతా జీవుల సంగతేంటని ఎప్పుడైనా ఆలోచించామా? రోజుకి ఎన్ని ప్రాణులు తుదిశ్వాస విడుస్తున్నాయో లెక్కగడుతున్నామా? ఆ కళేబరాలను ఏ శ్మశానంలో, ఎవరు పూడ్చుతున్నారు? వ్యాధుల వ్యాప్తిని అరికట్టేదెవరు? వీటన్నిటికీ బదులుగా సృష్టి ‘సహజ పారిశుధ్య కార్మికులను’ నియమించింది. కుక్కలు, రాబందులు, కాకులు వంటి ప్రాణులు.. మృతదేహాలను ఆహారంగా చేసుకొని వ్యాధుల వ్యాప్తిని అరికడుతున్నాయి. అదే ప్రకృతి మనకిచ్చిన వరం. లేదంటే ఈ భూమి శవాల కుప్పలతో నిండి.. సమస్త ప్రాణులూ వ్యాధుల బారినపడి అంతమయ్యేవి. కానీ, మనం వాటిని రక్షించకపోగా.. వాటికి హాని తలపెడుతున్నాం. ఉదాహరణకు రాబందు. దేశంలో రాబందుల సంఖ్య.. వాటి సమస్త జాతి అంతమయ్యేంత తీవ్రంగా తగ్గుతోంది. పశువుల చికిత్స కోసం విస్తృతంగా వాడిన డైక్లోఫెనాక్ అనే ఔషధం ఈ వినాశనానికి కారణం.
ఈ మందు కలిసిన పశువుల మృతదేహాలను తిన్న రాబందులు తీవ్రమైన కిడ్నీ సమస్యలతో మరణిస్తున్నాయి. ఫలితంగా 97 శాతం కంటే ఎక్కువగా రాబందుల సంఖ్య తగ్గిపోయింది. ఇది కేవలం ఒక జాతి నాశనం కాదు, పర్యావరణ సంక్షోభానికి ఆరంభం. ఇలాంటి జీవులు అపశకునాలు కావు. జీవావరణ సమతుల్యతను కాపాడే ప్రాణులు. వాటిని అసహ్యంగా చూడొద్దు. మన ప్రేమ, ఆదరణ వాటికెంతో అవసరం. శ్రీరాముడంతటి వాడే, రెక్కలు తెగిపడ్డ జటాయువు అనే పక్షి రాజాన్ని గుండెలకు హత్తుకొని దుఃఖించాడు. ఆ కాలం సంగతి ఆ రాముడే ఎరుగు.. ఈ కాలంలో జటాయువు ఎగరకపోతే, మన భవిష్యత్తు ఎగరదు. పశుపక్ష్యాదులను రక్షించుకోవడం మనందరి బాధ్యత. ధన్యవాదాలు” అని ఉపన్యాసం ముగించి.. పరుగు పరుగున మాస్టారు దగ్గరికెళ్లాడు.ఆడిటోరియం చప్పట్లతో మారుమోగింది. కలెక్టర్ చేతుల మీదుగా బహుమతి అందుకుని, షేక్ హ్యాండ్ తీసుకొని, ‘ఆల్ ది బెస్ట్’ చెప్పించుకున్నాడు. అతని ఆనందానికి అవధుల్లేవు. మాస్టారు, వినయ్ కలిసి పావుగంటకు పైగా అందరి అభినందనలు అందుకొని, బయట పచ్చికపై నడిచారు. కాసేపటికి ఇద్దరి మధ్య నిశ్శబ్దం అలుముకుంది. వినయ్ మౌనంలో పొంగుతున్న ప్రశ్నల వరద మాస్టారు మనసును తాకింది.
“ఆర్ యూ ఓకే వినయ్?” అన్నాడు మాస్టారు. “ఒక డౌట్ సార్..!” కనుబొమ్మలు దగ్గరగా చేసి, మాస్టారు కళ్లల్లోకి సూటిగా చూసాడు.మాస్టారు స్పందించెలోగా, మళ్లీ వినయ్.. జటాయువు స్థానంలో నేనే ఉంటే, శ్రీరాముడు హత్తుకునేవాడా..? అదీ.. నన్ను?” పసితనాన్ని ఒలకపోస్తూ ఆసక్తిగా అడిగాడు. ఆ ప్రశ్నలోని లోతైన భావం అర్థంగాక నిర్ఘాంతపోయాడు మాస్టారు. ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో తికమకపడ్డాడు. కాసేపటికి తేరుకొని వినయ్ భుజం మీద చెయ్యేసి.. “తప్పకుండా అలానే చేసేవాడు వినయ్. దేవుడికి పక్షపాతం లేదు. పిల్లలంటే ఎంతో ఇష్టం! తెలివైనవాళ్లంటే మరీనూ!” తల నిమిరాడు మాస్టారు. కాలేజ్ బస్ హారన్ విన్న వినయ్ ఒక్క గెంతు గెంతాడు. మాస్టారు కూడా బైక్ తీశాడు. పరుగెత్తుతున్న వినయ్, మార్గమధ్యలోనే వెనుదిరిగి.. “సా.. ర్..! నేను రాబందును చూడాలి. టీవీలో కాదు. నిజంగా… ఈ కళ్లతో!” చూపుడు వేలుతో తన కళ్లవైపు చూపిస్తూ వినపడేట్టు అన్నాడు. మాస్టారు ఓ నవ్వు నవ్వి, ‘సరే’ అన్నట్టు తలూపి, వినయ్ కుతూహలానికి ముచ్చటపడ్డాడు.
దేశాయిపేట్, వరంగల్. వినయ్ హాస్టల్ నుంచి ఇంటికొచ్చి రెండు రోజులవుతోంది. సిటీలో మురికి వాడల్లో, కిక్కిరిసిన ఇళ్ల మధ్య ఓ రేకుల ఇంట్లో నివాసం. తల్లి లచ్చమ్మ మున్సిపాలిటీ ఉద్యోగిని. కోడి కూడా నిద్రలేవని వేళకు లేచి, రోడ్లు శుభ్రం చేసి.. ఉదయం పది గంటలకు ఇంటిని చేరుకొని గిన్నెలన్నీ బయటేసి తోముతుంది. మంచం మీద కూర్చున్న తాత నర్సయ్య.. న్యూస్ పేపర్లో, కలెక్టర్ చేతుల మీదుగా బహుమతి అందుకుంటున్న తన మనవడి ఫొటో చూస్తూ మురిసిపోతున్నాడు. ఆ పక్కనే చాప మీద దుప్పటి కప్పుకొని పడుకుంది వినయ్ చెల్లి లత.
“అడిగిన ప్రశ్నే మళ్లీ అడగకు తాతా! సఫాయినైతే కానులే!” విసుక్కున్నాడు వినయ్.“నేనెప్పుడు అడిగిన? నువ్వెప్పుడు జెప్పినవ్? పోనీ.. ఈ ఒక్కసారికి జెప్పు. యాదికి లేదురా!” నిట్టూరుస్తూ కళ్లజోడు వెతుకుతున్నాడు నర్సయ్య..వినయ్ వేగంగా వచ్చి, తాత ముందు కూర్చొని, చేతులు పట్టుకొని కళ్లలోకి చూస్తూ.. “చూడు తాతా! స్టెతస్కోపుతో నీ గుండె చప్పు డు వింటూ నీ కళ్లల్లో ఆనందం చూడాలనే రోజు కోసం ఎదురుచూస్తున్న. ఆ క్షణం, ‘నువ్వెవరు..?’ అని నన్ను అడగవ్ కదా!.. మ్మ్?” అంటూ, తాత కళ్లకే ఉన్న కళ్లజోడు తీసి చేతిలో పెట్టి వెళ్లిపోయాడు.
కళ్లజోడు చూస్తూ ఆశ్చర్యానికి లోనయ్యాడు నర్సయ్య.
“పెద్ద రోగమా..?” భయంగా అన్నాడు. “అల్జీమర్స్..! మతిమరుపు. ఎంత భయపడితే అంత ఎక్కువైతది తాతా. టైముకు ఆ మందులు ఏసుకొని, ప్రశాంతంగా ఉండు. అదే తగ్గుతది” అంటూ, గిన్నె మూతతీసి పళ్లెంలో అన్నం పెట్టుకున్నాడు వినయ్.“డాక్టర్ అయితవా..?”“హా..! హాస్పిటలే ఇల్లు, ఇల్లే హాస్పిటల్.. అప్పుడు కానీ నాకు సరిగ్గా నిద్రపట్టదు. ఈ మురికితో, దోమలతో పడలేను. ఇంకో వారంలో ‘నీట్’ హాల్ టికెట్ వస్తది. ఎట్లయిన గవర్నమెంట్ సీటు కొట్టాలె తాత. మీ మీద పైసల భారం తగ్గియ్యాలె!” అంటూనే, వడివడిగా వచ్చి తాత చేతిలోని పేపర్ లాగేసి, పళ్లెంలో అన్నాన్ని వాసన చూపించాడు.. గుప్పుమన్న వాసనకు నర్సయ్య మొహం చిట్లించి,“ఏమంత కరాబైంది బిడ్డ! నీరొచ్చిన మెతుకులు పక్కకు బెట్టి, మంచిగున్న కాడికి నువ్వు తిను. అటెన్క ఉప్పేసుకొని తాగుతా!” అని నర్సయ్య అన్నాడో లేదో.. తాత నోటికి చేతిని అడ్డు పెట్టి.. ‘మెల్లగా’ అని గుసగుసలాడాడు వినయ్.
అప్పటికే ఆ మాటలు లచ్చమ్మ చెవిన పడ్డాయి. నాలుక కరుచుకున్నారు ఇద్దరూ.. “పరమాన్నాలు, పసాదాలు తిన్నీకి నీ అయ్య కోట్లు కూడబెట్టలే! డూటీ కాన్నుంచి వచ్చేటాళ్లకు లేట్ ఐతనే ఉండే.. ఆకలికి సత్తరని నాలుగు గింజలు రాత్రే వండి పెడితే.. పొద్దెక్కె దాకా పండుడు, బువ్వ కరాబైందని ఒర్రుడు. ఆడ నేనే జెయ్యాలే, ఈడ నేనే జెయ్యాలే” అంటూ, ఒక్కొక్క గిన్నె తోముకుంట కోపంగా విసిరేసింది లచ్చమ్మ.. గిన్నెల చప్పుడు, ఆమె కోపంలోని తీవ్రతను చూపుతున్నాయి. ఇదంతా అప్పుడప్పుడూ ఉండేదే అయినా.. ఈసారి ఎందుకో, వినయ్ సహనాన్ని కోల్పోసాగాడు.“హాస్టల్‌కి పోతే మల్లెప్పుడు ఇంటికి పోదామా!? అనిపియ్యాలే. నాకు ఇంటికొస్తే హాస్టలెప్పుడు పోదామా? అనిపిస్తుంది. నన్ను ఏదో ఒకటి అనకుండ ఉండలేవానే..? నేనంటేనే నీకు ఇష్టం లేదు.. నాన్నుంటే ఈ బాధలే ఉండకపోవు”.. గొంతు పెంచాడు వినయ్.
“ఏందీరా..? బాధలు ఉండకపోవునా..? తాగి తాగి అడ్డంబడి ఐదేండ్లు అరిగోస వంచుకున్నడు నీ అయ్య.. ఐదు లచ్చలు అప్పుదెస్తే ఇప్పటిదాకా తీరలే. నీ అయ్య నన్ను బాయిల నూకి సచ్చిండు. ఇగ నువ్వొచ్చి ఇప్పుడు కాలుకు బండ కట్టు.. ఆయింత మునిగి సత్తే.. అందరి కండ్లు సల్లబడతయ్!” అని మరో రెండు గిన్నెలు విసిరికొట్టింది. “నువ్వెందుకు సావాల్నే! నేనే పోత తియ్యి. సెలవులక్కూడా ఇంటికి రాను. సారు కాళ్లు మొక్కయినా హాస్టళ్లనే ఉంట”“గా పంజెయ్యి! ఎవడు రమ్మంటండు ఇంటికి. పైసకు పనికిరాడు గని.. కోపానికి తక్కువలేదు”
గొడవొద్దని నర్సయ్య చెప్తున్నా వినలేదు. వినయ్ మొహం మాడిపోయింది. కళ్లు ఎర్రబడ్డాయి. పళ్లెం నేలకేసి బలంగా కొట్టాడు. అన్నం చెల్లాచెదురై, పళ్లెం గిర్రున తిరుగుతుంటే.. లత దిగ్గున లేచి కూర్చుంది.. మసి చేతుల్తోనే మెరుపువేగంతో వినయ్ ముందుకొచ్చింది లచ్చమ్మ.. ఒక చేత్తో వినయ్ చెంపలను గట్టిగా నొక్కిపట్టి, ఇంకో చేతి చూపుడు వేలుని లత వైపు చూపిస్తూ..
“మొన్ననే నీ చెల్లె పెద్ద మనిషి అయ్యింది.
మూలన పడి మూలుగుతంది.. ప్యాడ్ కొందామంటె పైస లేదు. జీతం పైసలు ఆకిట్లకన్న వత్తన్నయా!? అంత రేశం గల్లోనివైతే పనికి బొయ్యి పదిరుపాలు దెచ్చియ్యి పో! బువ్వ మీద కోపం సూపిచ్చేంత బతుకు బతుకుతున్నమా!? రెండు మెతుకులు సంపాదిస్తే తెలుస్తది”.. మొహంలో మొహం పెట్టి ఆవేదన కక్కి బయటికెళ్లింది.వినయ్ నోరెళ్లబెట్టి క్షణాలపాటు చెల్లి వైపు చూశాడు. మొహం మీద మసి తుడుచుకోకుండానే, దుఃఖంతో బయటికెళ్లిపోయాడు. వద్దని నర్సయ్య ఎంత వారించినా ఆగలేదు.“తెల్వని పోరని మీద కోపమెందుకు లచ్చవ్వ. వాడు తినకుంటనే అలిగి పోతండే! జర మనమే ఓపిక జేసుకోవాలె. పిల్లలు ఎదుగుతున్నరు. నాలుగు రోజులు బోనీ.. వాడే నౌకరు చేసి అందరిని సాదుకుంటడు.. కలెక్టరే మెచ్చుకున్నడంటే మాటలా మరి!” అంటూ, కిందపడ్డ మెతుకులన్నీ పళ్లెంలోకి ఎత్తాడు నర్సయ్య.
“వాళ్లు వీళ్లు మెచ్చుకుంటే పళ్లెం నిండుతందా? ‘సఫాయి నర్సయ్య మా సెప్టిక్ ట్యాంకులు శుభ్రం చేయకపోతే బతికేటోళ్లమే గాదు. వాన్ని దేవుడనుకొని దండం పెట్టినా తప్పులేదు..’ అని దండలేసి శాలువలు గప్పితిరి! ఆ మెప్పులకు ఏమొచ్చింది..? సూపెట్టవ్ మరి.. నీ బంగారు పళ్లాలు, ఎండి శెంబులు..?” తీవ్రంగా కసిరింది.“మనం గాకపోతే ఇంకెవరు జేత్తరు బిడ్డా..! తాతల కాన్నుండి గదే పనాయే. ఆళ్ల లెక్క మనం. ముట్టుకునే దైర్నం కూడా ఎవ్వరు జేయని పని, మనం జేత్తన్నమంటే గొప్పనే కదా..!” అన్నాడు వాసనొస్తున్న మెతుకుల్ని, ఉప్పేసి కలుపుతూ..
“నీ గొప్పలు చర్ల బెట్ట. తిండానికి తిండిలేదు, మాటలకు మతిలేదు. నీ మనవరాలు బడి ఎట్ల బంజేసిందో మర్శిపోయినవా!?” పళ్లు పటపట కొరుక్కుంటూ, కోపంగా దొండకాయలు ముందటేసుకుంది. జ్ఞాపకమే లేదన్నట్టు కోడలి వైపు అమాయకంగా చూసాడు.
“అగో.. బల్లి గుడ్లేసి నన్ను జూత్తవ్! పోయి డప్పు కొట్టుపో నీ గొప్పతనం గురించి.. ‘సఫాయి నర్సయ్య మనవరాలు’ అని బడి పిల్లలు ముక్కులు మూసుకొని పక్కకు కూసుంటలేరట.. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టయింది బతుకు. కులం మీద గులిగేది సాలదని, పని మీద సుత బడ్డరు” ఆవేదనతో కళ్ల నీళ్లు పెట్టుకుంది. “ఆడిపిల్ల సదువకపోతే ఎవనికి నష్టం.. వాడు సదివితే సాలు. కొన్నాళ్లు ఓపిక బట్టు. కట్టం దప్పుతది” అంటూ, ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. “నువ్వు ఎన్నయినా చెప్పు మావ.. లత ఫంక్షన్ చేసి, కులపోల్లకు భోజనాలు పెట్టియ్యాలె! ఇజ్జత్ దక్కాలంటే పైసలు గావల్నా? పానం మంచిగ ఉంటలేదని నువ్వు పనికే పోతలేవైతైవి. కాళ్లు అరుగుతున్నయ్ గని అప్పు పుడుతలేదు. వినయ్ గాన్ని బడి బందుపెట్టి, ఎక్కడన్న హోటళ్ల జీతముంచి, అడ్వాన్స్ తీసుకొని ఫంక్షన్ జేద్దాం. నాలుగు చేతులాడుతనే నాలుగు రాళ్లు. లతకు పెళ్లీడు వచ్చేయాలకు చేతుల పైసలుండాలే. అందుకు వినయ్ గాడు పనికెక్కాలే.. ఆడు నీ మాటే వింటడు. ఎట్లనో అట్ల నువ్వే ఒప్పియ్యి. మొగోనికి కండెక్కువ. ఎట్లయినా బతుకుతడు. ఆడిపిల్ల అట్ల గాదు. అందుకే దాని మీద నాకు సోయెక్కువ. ఇగ నా కొడుకు ‘డాక్టర్ అయిత’ అన్నప్పుడల్లా గుండె బరువైతంది. పేదోని కడుపున పుట్టుడు కంటే పశువుగ పుట్టుడు మేలు!”
“గట్ల గాదవ్వా!” నర్సయ్య ఏదో చెప్పబోతుంటే.. వెంటనే లచ్చమ్మ,“మరెట్లా..? నా ఒళ్లు అమ్ముకోవన్నా..?” ఆవేదనతో అరిచి కన్నెర్రజేసింది.ఆమె అన్న మాటకు నర్సయ్య హృదయం ద్రవించింది. తినే అన్నం మింగుడుపల్లేదు. విపరీతంగా చలించిపోయాడు. నోట మాట రాలేదు. మనవడి కోసం గుమ్మంకేసి చూశాడు. ఆ తర్వాత ఏదైనా పనుంటే చూడమని సూపర్వైజర్ సుధాకర్‌కు ఫోన్ చేసి మాట్లాడాడు. “గీ ముసలితనంల నీకేడ చాతనైతది. కాకపోతే కుక్కలో, పిల్లులో సచ్చిపోతే తీసి పడేయడానికి పిలుస్తలే నర్సయ్యా!” అని సుధాకర్ అన్నాడు.“నా ఆకలికి ఏ కుక్కను సావమంటవ్! పాపం.. నోర్లేని జీవులు. దాందీ.. నా అసొంటి పానమేనాయే!” గొణుగుతూనే ఫోన్ పెట్టేశాడు నర్సయ్య.
అప్పటికే చాలాదూరం వచ్చేశాడు వినయ్. జరిగిందాన్ని తలచుకొని తనలో తాను ఓ యుద్ధమే చేశాడు. ఎండ మండిపోతుంటే చెమటలు కక్కాడు. విపరీతమైన దాహమేసింది. ఆత్రంగా జేబులెతికి రెండు రూపాయలు చేతబట్టుకొని కిరాణా షాపును చేరాడు. వాటర్ ప్యాకెట్ కొనుక్కొని.. రెండు బుక్కలు గటగటమని నీళ్లు తాగాడు. సగం ప్యాకెట్ పట్టుకొని, రెండు రూపాయల బిళ్లను షాపతనికి ఇచ్చాడు. ఆ పెద్దాయన, బిళ్లను తీసుకుంటూనే కోపంగా అరుస్తూ బయటికొచ్చాడు.. “పట్టపగలు రోడ్డుమీద ఏందిరా అది? తాగినవారా? గోడ మీద ఏం బొమ్మున్నది? నువ్వేంజేత్తన్నవ్? గట్ల ఆ చెత్త మీద పోస్తే, నీ అయ్య గిట్ల ఎత్తి పోస్తడా? ఎవ్వడు జూడు ఇక్కన్నే పోత్తళ్లు” అగ్గిలం మీద గుగ్గిలం అయ్యాడు షాపతను. పూర్తిగా మూత్ర విసర్జన చేసిన ఆ తాగుబోతు, వెనుదిరిగి.. “మరి నీ అయ్య గిట్ల ఎత్తి పోత్తడా చెత్తను..? కాదు గదా! ఈ జాగ నీదా.. నీ అయ్యదా? నీ ఇంట్ల గిట్ల పోసిన్న? బాగ ఉరుకొత్తన్నవ్” అని కయ్యానికి కాలు దువ్వాడు.
అప్పుడే వినయ్ చూపులు గోడ మీద పడ్డాయి. ఆ గోడమీద చిత్రంలో.. గోచి కట్టుకుని, చీపురు పట్టుకొని, తట్టలోకి చెత్తను ఊడుస్తూ బోసి నవ్వు నవ్వుతున్నాడు మహాత్మా గాంధీ. ఆ పక్కనే కళ్లజోడు చిత్రంలో ‘స్వచ్ఛ భారత్’ అని రాసి ఉంది. తన చూపు తడిసిన చెత్తకుప్ప మీదకు మళ్లింది. కాసేపు మనసు కకావికలమైంది. ఆలోచిస్తూ, వెనుదిరిగి, తలెత్తి నీళ్లు తాగుతుంటే.. కళ్లెదురుగా షాపులో దండెం మీద ‘శానిటరీ ప్యాడ్స్’ కనిపించాయి. తన చెల్లి గుర్తొచ్చింది. క్షణాల్లో ప్యాడ్ రేటును కళ్లతో వెతికి పట్టేశాడు. ‘డబ్భు.. డబ్భు రూపాయలు’ అని మదిలో అనుకుంటూనే అక్కణ్నుంచి నిష్క్రమించాడు. ఏదో ఒకటి చేసి ఇప్పుడే సంపాదించి, ప్యాడుతోనే ఇంటికెళ్లాలని అనుకున్నాడు. ఆ ఏరియాలో, జనాలు పనుల కోసం పడిగాపులు కాసే ప్రతి అడ్డా తిరిగాడు. పనిలేదని కొందరు, పనిచేసే వయసు కాదని మరికొందరు అతన్ని వెళ్లగొట్టారు. ఎడారిలో నీళ్ల కోసం వెతికనట్టుంది పరిస్థితి. ఎండకి తాళలేక ఒక అపార్ట్మెంట్ పరిచిన నీడలో నిల్చున్నాడు. పక్కనే ఒక సంభాషణ వినిపించింది.
“నువ్వెన్ని పైసల్ ఇచ్చినా, నేను దాంట్లోకి దిగలేను. నాతోని గాదన్న. నన్ను వదిలేయ్” అంటూ వెళ్లిపోయాడు ఒక వ్యక్తి. అతని వెనకాలే బతిమాలుతూ వెళ్లాడు సూపర్వైజర్ సుధాకర్. అయినా లాభం లేకపోయింది. “అన్నా.. నే చేస్తా. పనేంటో చెప్పు” వినయ్ అనగానే, సుధాకర్ వెంటనే ఒప్పుకొన్నాడు. కానీ, పనేంటో తెలిసాక వినయ్ నిరాకరించాడు. ఆలోచనల్లో పడ్డాడు. ఆ పని చేయడం తనకు ఎంతకీ ఇష్టం లేదు. సుధాకర్‌కి ఆ పని పూర్తవడం ఎంతో అవసరం. రకరకాల మాటలు చెప్పి ఒప్పించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ వినయ్.. వద్దని తనకు తాను ఎంత నచ్చజెప్పుకున్నా, ఇంటి సమస్యలు ముందుకు తోస్తూనే ఉన్నాయి.. చివరికి వినయ్ ఓడిపోక తప్పలేదు. పైనుంచి సుధాకర్ అందిస్తున్న తాడు పట్టుకొని, అర్ధనగ్నంగా ఉన్న వినయ్ కొద్దికొద్దిగా ‘మ్యాన్ హోల్’లోకి దిగాడు. క్రమంగా చీకట్లోకి జారాడు. చెత్తతో కూడిన బురదలో అడుగేయగానే.. హాయిగా సేదతీరుతున్న క్రిములు, రెక్కల పురుగులు ఉలిక్కిపడి పైకి పరుగుతీశాయి. అప్పటికే ఒక గాజు పెంకు, అతని అరికాలును చీల్చి రక్తం రుచి చూసింది. విలవిల్లాడిపోయాడు.
భరించలేని దుర్వాసనకి ఉక్కిరిబిక్కిరయ్యాడు..“నాతోని కాదన్న.. నన్ను బయటికి లాగు” అని ఎంత వేడుకున్నా.. సుధాకర్ వినకపోగా బకెట్ దింపి చెత్తని, బురదను ఎత్తమని ఆదేశించాడు. పది నిమిషాలు ఓపిక పడితే, చాలా డబ్బులిస్తానని ఒప్పించాడు. చేసేదేమీ లేక భరించడం మొదలెట్టాడు వినయ్. మలినాన్ని ఎత్తి పైకి పంపిస్తున్నాడు.. కాసేపటికి ఆలోచనల పరంపరతో, తనలో తాను మాట్లాడుకోవడం ఆరంభించాడు.. ‘యాక్! ఇదేం కంపురా! ఇంకో వంద ఎక్కువే అడగాలి. మనిషన్నోడు చేస్తడా గీ పని. ఏమైతేనేం! డబ్బులతో మావోళ్లకు షాక్ ఇవ్వాల్సిందే!’ఒక్కొక్క బకెట్ పైకి పంపిస్తూనే ఉన్నాడు. బకెట్ అంచుల నుంచి కారుతున్న మురుగు నీటి ధారను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నా.. బొట్లు బొట్లుగా మీద పడుతూనే ఉంది. ‘ఓరి నాయనో! తాత ఎట్ల చేస్తున్నాడ్రా బాబు. ఒక్క రోజుకే సచ్చి పుడుతన్న. వామ్మో!! దీన్ని పనంటరా? నరకంలో శిక్ష. మరి అమ్మా? తన పనీ దారుణమే! ఆ షాపోడు, తాగుబోతు గొడవ పడుతుంటే తలతిరిగింది. మనుషుల విసర్జన ఎత్తిపోసే రాత, దేవుడు మాకే ఎందుకు రాశాడో! అయినా నాకో డౌటు! రాతలు నిజంగా దేవుడే రాస్తడా..?’పైనుంచి సుధాకర్ అరుపుతో తన ఆలోచనలకు కాసేపు విరామం పడింది.
“మ్యాన్‌హోల్ అడుగున ఒక పైపు కనెక్ట్ అయ్యుంటది. అది బురద కట్టి మూత పడిందా చూడు. అదొక్కటి తీసేస్తే ఖతం!” సుధాకర్ చెప్పగానే, వినయ్ ఆ వైపు కదిలాడు. ఆ పైపు ద్వారం వద్ద, చెత్త ముద్దలాగా గడ్డ కట్టి ద్వారాన్ని మూసేసింది. దాన్ని తొలగించాలంటే బలం సరిపోలేదు. పైనుంచి సుధాకర్ ఇచ్చిన ఇనుప రాడ్డుతో ప్రయత్నిస్తూనే మళ్లీ ఆలోచనల్లోకి జారుకున్నాడు..‘దేవుడే రాస్తడా రాతలు? మ్మ్.. రాయడనుకుంటా! ఒకవేళ రాస్తడే అనుకుందాం! మాకే ఎందుకిలా? అసలు భూమ్మీద పుట్టిన ఏ ప్రాణీ ఇంత కంపు భరించదు. ఒక్కటంటే ఒక్కటి కూడా.. మర్చేపోయా! రాబందులు ఉన్నాయ్ కదా..!’ లోపలి నుంచే ఆకాశంకేసి చూసాడు. దూరంగా అక్కడెక్కడో చీమల్లా రెండు పక్షులు కనిపించాయి.
వాటిని చూసి.. ‘ఓయ్ రాబందులారా! మా బతుకూ.. మీలెక్కనే. మనదంతా ఒకే జాతి. హహ.. హా.!!’ తనలో తాను నవ్వుకుంటూ, ఆ గడ్డను బలంగా కొట్టాడు. అది పగిలి గాఢమైన కుళ్లిన కోడిగుడ్డు వాసన విడుదల చేసింది. ముక్కు గట్టిగా మూసుకున్నాడు.‘ఒక్కసారన్న దేవుడికి పాపం అనిపియ్యలేదా..? రోగాలు రాకుండా ఒళ్లుని, ఎంత కంపునైనా భరిం చే ముక్కుని ఇవ్వాలని. అదే.. రాబందులకు ఇచ్చినట్టు! అప్పుడైతే ఈ గబ్బు పని విసుగు లేకుండా చేసేవాళ్లం కదా..!! ఏమంత పాపం చేశాం దేవుడా..? మరీ.. ఇంత పక్షపాతమా?’.పులో నుంచి మురుగు నీరు భళ్లున్న తన్నుకొస్తూ విష వాయువులతో ఉక్కిరిబిక్కిరి చేసింది. క్షణాల్లో పరిస్థితి విషమించింది. వినయ్‌కి శ్వాస తీసుకోవడం చాలా కష్టమైంది. గుండె వేగం పెరిగింది. గొంతు పెగలటం లేదు. విషవాయువులు నరనరాల్లో పరుగులు పెడుతున్నాయి. చేతులు చాచి, పైనుంచి ప్రసరిస్తున్న వెలుగుకేసి చూశాడు.
‘నేను అస్సలు చావకూడదు’ లోలోపలే అనుకొని గట్టిగా ఊపిరి పీల్చాడు..‘నేను చావను.. చావనే చావను’ పదేపదే అనుకుంటూ శక్తిని కూడగట్టాలని విశ్వప్రయత్నం చేశాడు. ఒంట్లో విషాలు పాతాళంలోకి తొక్కేస్తున్నాయి. అయినా, సంకల్ప బలాన్ని మూటగట్టుకొని ఎలాగోలా మ్యాన్ హోల్ నుంచి బయట పడగలిగాడు. ఒళ్లంతా నల్లటి బురదతో, మోకాళ్లపై చేతులేసుకొని వంగి, రొప్పుతూ, డబ్బుల కోసం సుధాకర్ వైపు చెయ్యి చాచాడు. ఆశ్చర్యంతో నోరు తెరిచి, జేబులో నుంచి డబ్బు తీసి ఇచ్చాడు సుధాకర్. శక్తినంతా కూడదీసుకొని నగరపు వీధుల వెంబడి పరిగెత్తుతున్నాడు వినయ్. జనమంతా బిత్తరపోయి చూస్తున్నారు. తన శ్వాస శబ్దాలు, గుండె చప్పుళ్లు మాత్రమే వింటున్నాడు. దేహం చెమటలు కక్కుతూ, ఒంటి మీది బురదను సన్నని ధారలుగా కిందకి తోస్తోంది. తన దృష్టిలో ప్రపంచమంతా స్తంభించింది. మురికి వాడలను దాటుకొని ఇంటిని చేరుకున్నాడు. సత్తువ క్షీణించి అడుగులు భారంగా పడుతున్నాయి. గుమ్మం బయట కూర్చున్న చెల్లిని చేరి కుప్పకూలి పోయాడు..
మెల్లమెల్లగా కళ్లు మూతలు పడుతుంటే, చేతిలోని డబ్బుని లతకు ఇవ్వజూపాడు. మసకగా లత మొహం కనిపించింది.. వాయువేగంతో తల్లి, తాత బయటికొచ్చారు. కొంత సమయం తర్వాత అంబులెన్సులో తరలిస్తుంటే తాత మొహాన్నే చూస్తున్నాడు వినయ్.. చూస్తుండగానే చికిత్స జరిగింది. చుట్టూ తెల్లటి గోడల్ని, పరిశుభ్రమైన నేలని, పరిసరాలని పరిశీలిస్తూ పక్కనే కూర్చున్న అమ్మ ఒడిలో పడుకొని చిన్నగా నవ్వాడు. స్వచ్ఛమైన తన మనుషుల మధ్య, స్వచ్ఛమైన గాలి కడుపు నిండా పీలుస్తూ పరవశించి పోయాడు. బాబుకి ఏం ప్రమాదం లేదని చెప్పి వెళ్తున్న డాక్టర్ని అలానే చూస్తూ తనను తాను ఊహించుకొని మురిసిపోయాడు. ఒకపక్క కడిగిన ముత్యంలా, మరకలేని మల్లెలా విరబూసిన చెల్లి. మరోపక్క తాత కళ్లలో సజీవంగా కనిపిస్తున్న కోటి ఆశలు. తన తల్లి గుండెలకు హత్తుకొని ఏడుస్తుంటే.. ఆ ప్రేమ మనసుని తాకి పరవళ్లు తొక్కింది. హాయిగా, మత్తుగా నిద్రపోయాడు. మునుపెన్నడూ లేని విధంగా..కానీ, అది నిద్ర కాదు. విషవాయువుల రాక్షస క్రీడ. యమపాశం మెడకు చుట్టుకొని తన ఊపిరిని హరిస్తోంది. మ్యాన్ హోల్లో శ్వాసకోసం కొట్టు మిట్టాడుతున్న వినయ్.. గట్టిగా ఊపిరిపీల్చి కళ్లు తెరిచి చూశాడు. పైనుంచి తాడు వదిలి సుధాకర్ అరుస్తున్నాడు. తాత, అమ్మ, చెల్లి, హాస్పిటల్.. ఏ..దీ.. లేదు! అంతా శూన్యం. ప్రతిదీ అబద్ధం. తన ఆఖరి నిమిషాల్లో, మనసారా కోరుకున్న అందమైన చివరి కల. అది ‘కల’ అని తెలుసుకునే లోపే.. శ్వాస గాల్లో కలిసిపోయింది.
“నమస్తే సుధాకర్ అన్న! పైసలో పైసలని మా కోడలు పొద్దున ఒకటే పంచాయితీ. నీ కడుపు సల్లగుండ. టైముకి పని సూపెట్టినవ్. ఏదా కుక్క? ఏడ సచ్చింది? సరే! దానికంటే ముందు నీకో ముచ్చట. నా మనవణ్ని చూళ్లేకదా? ‘మంచిగ సద్వియ్యి!’ అనేటోనివి గదా. ఇగో.. గీ పేపర్ జూడు” అని గర్వంగా సుధాకర్ చేతికిచ్చాడు నర్సయ్య. పేపర్ని చూడకుండానే విసిరికొట్టిన సుధాకర్.. “నీ మనవణ్ని ఇంటికొచ్చి సూత్తగని, నీకో ముచ్చట జెప్పాలె దగ్గరికిరా! సచ్చింది కుక్క గాదు, ఒక పోరడు. గుట్టు సప్పుడు కాకుండా సిటీ దాటియ్యాలె. బయట మనోడు ఒకడు చెత్త ట్రాక్టర్‌తో రెడీ! ‘ఎవరు? ఏంటి?’ అనేది నీకు అనవసరం. పది వేలిస్తా. ఏమంటవ్?” అన్నాడు.ఆ మాటలు నర్సయ్యను కాసేపు చిత్రవధ చేశాయి. ఏదో ఒకటి తేల్చుకునేలోపే.. తన ఇంటి ఆకలి నోట్లో గుడ్డలు కుక్కింది. నోటిమాట రాలేదు.
ఎలాగోలా మృతదేహాన్ని బయటికి తీసాడు. తన కళ్లని తానే నమ్మలేకపోయాడు. ఆరిన తన పేదింటి ఆశాదీపాన్ని చూసి దుఃఖం పొంగుకొచ్చింది. గుండె పగిలిపోయేంత వేదన. మనవణ్ని గట్టిగా హత్తుకొని గొంతు పగిలేలా ఏడ్చాడు. కన్నీళ్లు బొట్లుగా రాలి.. వినయ్ మొహాన్ని తడిపేస్తున్నాయి. పదేపదే శరీరాన్ని కుదిపేస్తూ కళ్లు తెరిచి చూడమని ప్రాధేయపడ్డాడు. ఏం లాభం! తనలాగే దేహం చాలించిన తరలనాటి పూర్వీకుల నుంచి.. నేటితరం కర్మచారుల్లో కలిసి వినయ్ గగనమెక్కాడు. కాసేపటికి నర్సయ్య ఆవేశంతో ఊగిపోయాడు. సుధాకర్‌ను చంపాలన్న కసి మొలకెత్తి తెగింపుతో లేవ ప్రయత్నం చేసి, ఆ మరుక్షణమే కూలబడ్డాడు. కాళ్లుచేతులు ఆడట్లేదు. కేవలం నిశ్శబ్దం. కొద్దిసేపటికి సుధాకర్..“నర్సయ్యా!” అని పిలిచాడు.
అతను తలతిప్పాడు. పిలిచినవాళ్లు ఎవరో, ఎందుకు పిలుస్తున్నారో అర్థం కాలేదు. తానెక్కడున్నాడో, ఏంచేస్తున్నాడో, ఆ శవంతో తనకు ఏ సంబంధమో అతని మనసు స్పందించలేదు. భయం లేదు, అలాగని దుఃఖమూ లేదు. అంతకుముందు జరిగింది, ఇప్పుడు జరిగింది ఏదీ గుర్తులేదు. అంతా మర్చిపోయాడు. సుధాకర్, డ్రైవర్ సహాయంతో హుటాహుటిన వినయ్ దేహాన్ని గోనెసంచిలో మూటగట్టాడు. ‘మురుగు వ్యర్థాల రవాణా వాహనము’ అని రాసున్న ట్రాక్టర్, మూటతో బయల్దేరి వీధులన్నీ దాటుతోంది. సిటీ నడిబొడ్డున భారీ బహిరంగ సభ. వందలమంది సఫాయి కర్మచారుల మధ్య కలెక్టర్ మైకులో మాట్లాడుతున్నాడు.. “మ్యానువల్ స్కావెంజింగ్ అనేది కేవలం ఒక పని కాదు. అది తరతరాలుగా కొనసాగిన ఒక సామాజిక అన్యాయం. డ్రై లెట్రిన్లోకి, భూగర్భ మురుగు కాలువల్లోకి దిగి మనుషుల అశుద్ధాలు ఎత్తే పని కొనసాగుతున్నంత కాలం.. ‘సమానత్వం’ అనేది సాధించలేని వట్టి భ్రమ. పదేళ్లుగా మనందరం కలిసి చేసిన కృషికి.. ‘మ్యానువల్ స్కావెంజింగ్ ఫ్రీ డిస్ట్రిక్ట్ అవార్డ్’ మన జిల్లాకు రావడం గర్వంగా ఉంది” అనగానే జనాల చప్పట్లు మోగుతున్నాయి.
ఆ సభను దాటుతూ ట్రాక్టర్ వేగంగా దూసుకెళ్లి, సిటీ అవతల ఎకరాల కొద్దీ పరుచుకున్న డంపింగ్ యార్డుని చేరింది. డ్రైవర్‌కి కాళ్లుచేతులు ఆడలేదు. మూటను అక్కడెక్కడో మధ్యలో వదిలేసి. భయంలో, కంగారులో.. పూడ్చడంగానీ, కాల్చడంగానీ చేయకుండానే వెనక్కి వచ్చేశాడు.మేఘాలు కమ్ముకున్నాయి. గగనతలంపై పక్షులు విహరిస్తున్నాయి. మేఘాల్ని, కాలుష్యపు పొగల్ని చీల్చుకుంటూ రెక్కలు చాచి నేలపైకి దిగుతూ, సరిగ్గా ఆ మూటపై వాలింది ఓ రాబందు. వాసన పసిగట్టి తన ముక్కుతో ఒక్కొక్క దారాన్ని లాగేస్తుంటే.. కొద్దికొద్దిగా ఆ దేహం బయటికి తన్నుకొస్తోంది. కరిచి కరిచి దారాల్ని పీకేసింది. మూటలోంచి వినయ్ తల బయటకొచ్చింది. తెరిచి ఉన్న తన కళ్లు ఆకాశానికేసి అర్థిస్తున్నాయి. అతని గుండెల మీద ఆ రాబందు నిల్చొని, తలను అటూ ఇటూ తిప్పుతూ సరాసరి వినయ్ కళ్లలోకి పరిశీలనగా చూసింది. ఆకాశంలో నల్లటి మేఘాలు చినుకుల్ని మోస్తూ పరిగెడుతున్నాయి. ఒక స్వచ్ఛమైన నీటి బిందువు వినయ్ నుదుటి మీద పడగానే.. రాబందు రెక్కలు విదిలించి పైకి ఎగిరి, మళ్లీ యథాస్థానంలో వాలింది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా కంటి పాపని లక్ష్యంగా చేసి, ఒక్కసారిగా దాడికి దిగింది రాబందు.
సాంఘిక సంక్షేమ కళాశాల, నర్సంపేట. ఐదువందల మంది పిల్లలు పొద్దున్నే గ్రౌండ్లో ప్రేయర్‌కి, క్లాసుల వారిగా వరుసగా నిల్చున్నారు. నీలి రంగు చొక్కాలతో ఆ ప్రాంగణం కలువ పూలతోటలా ఉంది. అక్కడ పూసిన ప్రతి పువ్వూ బురదలోంచి పుట్టిందే! ‘వందేమాతరం వందేమాతరం..సుజలాం, సుఫలాం, మలయజ శీతలాం..సస్యశ్యామలాం మాతరం.. వందేమాతరం..’ అని భారతమాతను స్తుతిస్తున్నారు. పది రోజులుగా ఆకలి, నిద్రలెరుగని లచ్చమ్మ.. ఎదురుచూపులో ఆకాశాన్ని తాకే ఆశ. టిఫిన్ బాక్సు లో వేడివేడి అన్నం తెచ్చి రోజూ కాలేజీ ప్రాంగణంలో లతతోపాటు పడిగాపులు కాస్తోంది. కొడుకొస్తే నాలుగు మెతుకులు తినిపించాలని ఆ తల్లి పేగు తల్లడిల్లుతోంది. శారీరకంగా, మానసికంగా కుంగిపోయింది.. నర్సయ్య జ్ఞాపకాల గది ఇంకా తెరుచుకోలేదు.
మెదడు పొరల్లో దాగిన ఆ మనోవేదనకు విముక్తి ఎన్నడో ఆ దేవుడికే తెలియాలి.పిల్లల గీతాలాపన సాగుతూనే ఉంది. దీనంగా తల్లినే అంటిపెట్టుకున్న లత వైపు మాస్టారు చూపు మళ్లింది. కాసేపటికి జేబులోనుంచి ‘నీట్’ హాల్ టికెట్ తీసి చూస్తే.. వినయ్ మొహం కనిపించింది. తనకిష్టమైన స్టూడెంట్ వినయ్, ముందు వరుసలో నిల్చొని జాతీయ గీతాలాపన చేస్తునట్టు కాసేపు మాస్టారు భ్రమ చెందాడు. తన కళ్లలో సన్నని నీటి పొరలు ఉబికాయి. ఆ వెనకాల నోటీస్ బోర్డుపై ‘మంచి మాట’ కింద ఒక మాట రాసుంది.‘నేను మళ్లీ జన్మించాల్సి వస్తే, ఒక అంటరానివానిగా/స్కావెంజర్‌గా పుట్టాలని కోరుకుంటాను. తద్వారా వారి కష్టాలను, అవమానాలను పంచుకుంటూ, ఆ దయనీయ స్థితి నుంచి వారికి విముక్తి కలిగించడానికి ప్రయత్నించగలను’
– మహాత్మా గాంధీ(యంగ్ ఇండియా పత్రిక, 1921)
‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2026’లో ద్వితీయ బహుమతి రూ.25 వేలు పొందిన కథ.
-బి. సుజిన్ కుమార్
86391 61721