తాజా ద్రవ్యసమీక్షలో ఒకేసారి అర శాతం రెపో రేటును తగ్గించిన ఆర్బీఐ.. ఇక ఈ కోతలకు బ్రేక్ వేయనుందా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంకేతాలే ఇందుకు నిదర్శనం. భవిష్యత్తులో వడ్డీరేట్ల తగ్గింపులు, పెంపులు.. వృద్ధిరేటు, ద్రవ్యోల్బణంపైనే ఆధారపడి ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఆర్బీఐ తమ పాలసీ వైఖరిని ఎకామ్డేటివ్ నుంచి న్యూట్రల్కు మార్చుకుంటున్నట్టు ప్రకటించింది మరి. దీంతో రాబోయే ద్రవ్యసమీక్షల్లో వడ్డీరేట్ల కోతలు తప్పక ఉంటాయని అంచనా వేయలేని పరిస్థితి. ఇప్పటిదాకా ఎకామ్డేటివ్ మానిటరీ పాలసీని ఆర్బీఐ పాటించింది. దీంతో వడ్డీరేట్లు తగ్గుతూ వచ్చాయి. కాగా, ఆర్బీఐ ప్రధానంగా మూడు ద్రవ్య విధాన వైఖరిలను ప్రదర్శిస్తుంది.
అందులో హాకిష్ పాలసీ ఒకటైతే, మరొకటి డోవిష్ పాలసీ. ఇంకొకటే న్యూట్రల్ పాలసీ. హాకిష్ పాలసీలో ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా వడ్డీరేట్లను అధిక స్థాయిల్లోనే ఉంచుతుంది. వడ్డీరేట్లను పెంచడం తప్ప తగ్గించదు. ఇక డోవిష్ పాలసీ (ఎకామ్డేటివ్)లో జీడీపీ వృద్ధికి పెద్దపీట వేస్తుంది. మార్కెట్లో ద్రవ్య సరఫరా పెరిగేలా, రుణ లభ్యతను పెంచేలా వడ్డీరేట్లను స్థిరంగా లేదా తగ్గిస్తూ ఉంటుంది. న్యూట్రల్ పాలసీలో ద్రవ్యోల్బణం, జీడీపీ డాటాల ఆధారంగా వడ్డీరేట్లను ఆర్బీఐ పెంచడం లేదా తగ్గించడం చేస్తుంది.
ఇదిలావుంటే దేశ వృద్ధిరేటు పురోగతికి తమ వంతుగా చేయాల్సింది చేశామని, ఇక మిగతావాళ్లూ చేయాలని మల్హోత్రా అన్నారు. బ్యాంకులు రెపో తగ్గింపు ప్రయోజనాన్ని రుణగ్రహీతలకు అందజేయాలంటూ పరోక్షంగా రుణాలపై వడ్డీరేట్ల తగ్గింపునకు పిలుపునిచ్చారు. ఇక భారత్-పాక్ ఉద్రిక్తతల ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై చాలా స్వల్పమన్నారు. కాగా, క్రిప్టో కరెన్సీలపై ఒకింత ఆందోళన వ్యక్తం చేశారు.
స్వల్పకాలిక నిధుల అవసరాలను తీర్చుకొనేందుకు ఆర్బీఐ వద్ద వాణిజ్య బ్యాంకులు తీసుకున్న రుణాలకు బ్యాంకర్లు చెల్లించే వడ్డీరేటు.
కమర్షియల్ బ్యాంకుల నుంచి ఆర్బీఐ తీసుకున్న నిధులపై బ్యాంకర్లకు ఆర్బీఐ చెల్లించే వడ్డీరేటు.
రెపో రేటు 50 బేసిస్ పాయింట్లు తగ్గుతుందని ఊహించలేదు. రుణాల వృద్ధికి ఇది దోహదం చేయగలదు. ఆర్థిక వ్యవస్థలోని ప్రతీ రంగానికి ఆర్బీఐ నిర్ణయం కలిసొచ్చేదే.
-సీఎస్ శెట్టి, ఎస్బీఐ చైర్మన్
ఆర్బీఐ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. దేశీయ మార్కెట్లో స్తిరాస్థి అమ్మకాలకు ఇది కలిసొస్తుంది.
-శేఖర్ జీ పటేల్, క్రెడాయ్ అధ్యక్షుడు
బ్యాంకులు ఈ ప్రయోజనాన్ని రుణగ్రహీతలకు అందించాలి. మధ్యతరగతి ఆదాయ వర్గాలకు గొప్ప ఊరట.
-జీ హరిబాబు, నరెడ్కో అధ్యక్షుడు
రెపో రేటును అర శాతం తగ్గించడం.. వృద్ధికి ఊతమిచ్చే నిర్ణయమే.
-హర్ష వర్ధన్, ఫిక్కీ అధ్యక్షుడు
ఆటో రంగానికి ఇది నిజంగా ప్రోత్సాహకరం. రెపో, సీఆర్ఆర్ తగ్గింపులు వృద్ధిదాయకం.
-సియాయ్, ఏసీఎంఏ
దేశ వృద్ధిరేటు మరింతగా బలహీనపడిందనిపిస్తే రాబోయే ద్రవ్యసమీక్షల్లోనూ వడ్డీరేట్ల కోతలుండే వీలున్నది.
-రాధీకా రావు, డీబీఎస్ బ్యాంక్ ఆర్థికవేత్త