న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: క్రెడిట్‌పై మొబైల్ ఫోన్లు కొన్నాక ఆ రుణాన్ని తీర్చకుండా దాటవేస్తున్నారా? అయితే ఆ ఫోన్లు పనికిరాకుండాపోయే అవకాశాలున్నాయి జాగ్రత్త. లోన్ ద్వారా మొబైల్స్ కొని, ఆ లోన్ ఎగవేతలకు పాల్పడుతున్నవారికి చెక్ పెట్టేందుకు ఆర్బీఐ ఓ ఆలోచన చేస్తున్నది మరి. ఇందులో భాగంగానే మొబైల్ ఫోన్ కొనడానికి తీసుకున్న రుణం చెల్లించకపోతే ఆ రుణం ఇచ్చిన సంస్థలకు సదరు ఫోన్లను లాక్ చేసే అధికారం ఇవ్వాలని చూస్తున్నది. లోన్ కిస్తీలు కట్టకపోతే ఏ ఫోన్ కోసమైతే అప్పు ఇచ్చారో దాన్ని వినియోగించకుండా చేసేస్తారన్నమాట. మొండి బకాయిలకు అడ్డుకట్ట వేసేందుకే ఈ ప్లాన్ అని బ్యాంకింగ్ వర్గాలు చెప్తున్నాయి.
లోన్ ద్వారా మొబైల్ ఫోన్ కొంటున్నప్పుడే ఆ రుణం ఇచ్చే సంస్థలు సదరు ఫోన్లలో ఓ యాప్‌ను ఇన్స్టాల్ చేస్తాయి. మీరు రుణ వాయిదాలు సక్రమంగా చెల్లిస్తే ఏ సమస్యా లేదు. కానీ ఈఎంఐలను చెల్లించకపోతే మాత్రం ఆ యాప్ ద్వారా మీ రుణదాతలు ఫోన్‌ను లాక్ చేసేస్తారు. దీంతో దాన్ని ఇక మీరు వాడుకోలేరు. ఈ మేరకు ఫోన్-లాకింగ్ మెకానిజంపై మార్గదర్శకాలు రానున్నాయి.
రుణదాతలతో సంప్రదించి ఆర్బీఐ ఓ తుది నిర్ణయానికి వస్తుందని సమాచారం. నిజానికి గత ఏడాదే ఈ ఆలోచన వచ్చిందని, దీంతో త్వరలోనే ఇది అమల్లోకి రావచ్చని కూడా అంటున్నారు. ఇదే జరిగితే బజాజ్ ఫైనాన్స్, డీఎంఐ ఫైనాన్స్, చోళమండలం ఫైనాన్స్ వంటి సంస్థలకు ప్రయోజనం చేకూరవచ్చన్న అంచనాలు ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్నాయి. కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లలో 85 శాతం వాటా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలదే. అలాగే లోన్ రికవరీలతోపాటు క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నవారికీ రుణలభ్యత పెరగవచ్చన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం దేశ జనాభా 140 కోట్లపైనే. ఇందులో 116 కోట్ల మంది మొబైల్ ఫోన్లు వాడుతున్నట్టు టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ చెప్తున్నది. ఇక మొబైల్ ఫోన్లు సహా కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అమ్మకాల్లో మూడింటా ఒక వంతు రుణాలపైనే జరుగుతున్నాయని నిరుడు హోమ్ క్రెడిట్ ఫైనాన్స్ చేసిన అధ్యయనం ద్వారా తేలింది. నిత్యం అప్డేట్స్, అధునాతన ఫీచర్లతో రకరకాల ఫోన్లు మార్కెట్లో సందడి చేస్తుండటంతో క్రెడిట్ ఆధారంగా మొబైల్ ఫోన్ల విక్రయాలైతే ఏటేటా భారీ ఎత్తున పెరుగుతున్నాయని సర్వేలు సైతం వెల్లడిస్తున్నాయి.
అయితే డిఫాల్టర్లూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఇక లక్ష రూపాయల దిగువన ఉన్న రుణాలకైతే ఎగవేత రిస్క్ ఎక్కువగా ఉంటున్నది. దీంతోనే ఆర్బీఐ పైవిధంగా అడుగులు వేస్తున్నది. ఇదిలావుంటే లాక్ చేసిన ఫోన్లలో ఉన్న వినియోగదారుల విలువైన సమాచారం చోరీ లేదా దుర్వినియోగం కాకుండా తీసుకునే చర్యలపైనా ఆర్బీఐ దృష్టిపెట్టినట్టు తెలుస్తున్నది.