RBI Shock to Paytm | ప్రముఖ ఫిన్టెక్ సంస్థ పేటీఎంకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గట్టి షాక్ ఇచ్చింది. ఇక పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో కొత్త ఖాతాదారులను చేర్చుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. పేటీఎం ఐటీ వ్యవస్థలో పూర్తిస్థాయి అడిటింగ్కు ఒక ఐటీ సంస్థను నియమించుకోవాలని తెలిపింది. తాము మంజూరు చేసే అనుమతులను బట్టే పేటీఎం కొత్త ఖాతాదారులను చేర్చుకోవడం ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. పేటీఎంలో బ్యాంకింగ్ లావాదేవీల్లో పర్యవేక్షణ లోపించిందన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇంతకముందు 2018 ఆగస్టులో కూడా పేటీఎంపై ఆర్బీఐ ఇదే తరహా నిర్ణయం తీసుకున్నది.
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం-1949లోని 35ఏ సెక్షన్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్బీఐ తెలిపింది. ఇక ముందు ఐటీ అడిటింగ్ సంస్థ ఇచ్చే నివేదికను బట్టి కొత్త ఖాతాదారులను చేర్చుకోవడంపై అనుమతి ఇస్తామని పేర్కొన్నది. గత డిసెంబర్లో షెడ్యూల్డ్ పేమెంట్స్ బ్యాంక్ నిర్వహణకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. దీంతో పేటీఎం ఫైనాన్సియల్ సేవల విస్తరణకు చేయూతనిచ్చింది.
పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మకు పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో 51 శాతం వాటా ఉంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్.. ఐపీవోకు వెళ్లిన తర్వాత సంస్థ మార్కెట్ విలువ పడిపోయింది. గత డిసెంబర్లో 926 మిలియన్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరిగాయి. 2016 ఆగస్టులో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఏర్పాటైంది. 2017 మేలో నొయిడా శాఖ కార్యకలాపాలు ప్రారంభించింది.