Rs.2000 Notes | కేంద్ర ప్రభుత్వం రూ.2,000 నోట్లను రద్దుచేయడం బ్యాంక్‌లను సమస్యల్లోకి నెట్టింది. ఈ నోట్లు ఇబ్బడి ముబ్బడిగా బ్యాంకుల్లో డిపాజిట్కావడంతో బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్యత (లిక్విడిటీ) పెరిగిపోయింది. అధిక లిక్విడిటీ ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపిస్తుందన్న భయాలతో ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో (ఐసీఆర్ఆర్)ను రిజర్వ్‌బ్యాంక్ పెంచింది. గత మూడు నెలల్లో అధికమైన డిపాజిట్లకు సీఆర్ఆర్ పెంపుదల వర్తిస్తుంది. ఈ పెంపు ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 8వరకూ అమల్లో ఉంటుంది. ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటారు.
ప్రతీ డిపాజిట్లో కొంత శాతాన్ని బ్యాంక్‌లు ఆర్బీఐ వద్ద అట్టిపెట్టాన్నది నిబంధన. దానినే సీఆర్ఆర్గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం 4.5 శాతంగా ఉన్న సీఆర్‌ఆర్‌పై బ్యాంక్‌లకు ఆర్బీఐ నుంచి వడ్డీ లభించదు. ఇప్పుడు తాత్కాలికంగా ఐసీఆర్ఆర్ను 10 శాతం పెంచడంతో బ్యాంక్‌ల వద్ద అధికమైన నికర డిపాజిట్లలో మొత్తం 14.5 శాతం ఆర్బీఐ వద్ద ఉచితంగా అట్టిపెట్టాల్సిందే. కానీ డిపాజిట్‌దార్లకు మాత్రం బ్యాంక్‌లు పూర్తి మొత్తానికి వడ్డీ చెల్లించాలి. డిపాజిట్లో 85.5 శాతం డబ్బునే రుణాలుగా ఇచ్చుకోవాలి. ఈ కారణంగా బ్యాంక్‌లు రుణాలపై రేట్లను పెంచాలి లేదా లాభాల్ని కోల్పోవాలి. మే 19నాటికి బ్యాంక్‌ల్లో డిపాజిట్ అయిన రూ.3.6 లక్షల కోట్లలో 90 శాతం రూ. 2,000 నోట్లేనని, దీనితోనే వ్యవస్థలో లిక్విడిటీ పెరిగి పోయిందని శక్తికాంత్ దాస్ వెల్లడించారు. సీఆర్ఆర్ పెంపుతో బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి రూ.1 లక్ష కోట్ల లిక్విడిటీని తీసుకుంటామని చెప్పారు. తాజా గణాంకాల ప్రకారం బ్యాంకింగ్ వ్యవస్థలో రూ.2.48 లక్షల కోట్ల మిగులు లిక్విడిటీ ఉంది. 2022 జూన్ తర్వాత ఇదే గరిష్ఠస్థాయి.