ముంబై, సెప్టెంబర్ 4: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా ప్రీ-సాంక్షన్డ్ క్రెడిట్ లైన్స్‌ను అనుమతించినట్టు సోమవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. లావాదేవీల కోసం బ్యాంకులు జారీచేసే ప్రీ-సాంక్షన్డ్ క్రెడిట్ లైన్స్ కూడా యూపీఐ సిస్టమ్‌లో భాగం కానున్నాయని, ఇవీ ఫండింగ్ అకౌంట్స్గానే పరిగణించబడుతాయని ‘ఆపరేషన్ ఆఫ్ ప్రీ-సాంక్షన్డ్ క్రెడిట్ లైన్స్ ఎట్ బ్యాంక్స్ థ్రూ యూపీఐ’ అన్న సర్క్యులర్‌లో చెప్పింది.
ప్రస్తుతం మన బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ చేసిన మొత్తాలే యూపీఐ నుంచి లావాదేవీలకు ఉపయోగపడుతున్నాయి. అలాగే సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు, ఓవర్‌డ్రాఫ్ట్ అకౌంట్స్, ప్రీ-పెయిడ్ వ్యాలెట్స్, క్రెడిట్ కార్డులనే యూపీఐకి అనుసంధానించుకోవచ్చు. ఈ క్రమంలో ఆర్బీఐ తాజా నిర్ణయం డిజిటల్ పేమెంట్స్కున్న ప్రాధాన్యతను మరింత పెంచిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో బ్యాంకుల ద్వారా యూపీఐపై ప్రీ-సాంక్షన్డ్ క్రెడిట్ లైన్స్ పొందవచ్చని, వీటి ఆధారంగా యూపీఐ ద్వారా లావాదేవీలను జరుపుకోవచ్చన్న ప్రతిపాదనను ఆర్బీఐ చేసిన సంగతి విదితమే. యూపీఐ లావాదేవీలు ఆగస్టులో 10 బిలియన్ల మార్కును దాటడం గమనార్హం.
క్రెడిట్ లైన్ అంటే?
బ్యాంకుల నుంచి పొందే రుణ సదుపాయమే ఈ క్రెడిట్ లైన్. ఇది కూడా ఓ క్రెడిట్ కార్డు వంటిదే. కస్టమర్ల వ్యక్తిగత ఖాతాలను పూర్తిగా పరిశీలించి, ఈ సౌకర్యాన్ని బ్యాంకులు కల్పిస్తాయి. సాధారణ రుణాలతో పోల్చితే ఈ క్రెడిట్ లైన్స్ పొందడం సులభమే. కానీ వడ్డీరేట్లు ఎక్కువగా ఉంటాయి.
వినియోగదారులకు ఏంటి లాభం?
క్రెడిట్ లైన్ సౌకర్యం ఉంటే.. రకరకాల క్రెడిట్ కార్డులను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. క్రెడిట్ కార్డుల అవసరం లేకుండా పేమెంట్స్‌ను చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డుల తరహాలోనే వినియోగదారులు ముందస్తు నిర్ణీత రుణ పరిమితి వెసులుబాటును పొందుతారు.
యూపీఐపై క్రెడిట్ లైన్ అంటే?
ఈ రుణ సదుపాయాన్ని కస్టమర్లు తమ మొబైల్లోని యూపీఐ యాప్‌ల ద్వారా ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు. ఆ తర్వాత వడ్డీతో బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే యూపీఐ వినియోగదారులు ఈ సౌకర్యం కోసం బ్యాంకుల వద్ద దరఖాస్తు చేసుకుంటేనే ఈ సదుపాయం లభిస్తుంది.
ఎలా ముందుకెళ్లాలి?
క్రెడిట్ లైన్ కోసం తమకు ఖాతాలున్న బ్యాంకులను ముందుగా యూపీఐ వినియోగదారులు సంప్రదించాలి. అప్పుడు మీ ఆదాయం, క్రెడిట్ స్కోర్, రుణ చరిత్ర వంటి వాటిని బ్యాంకర్లు పరిశీలిస్తారు. ఆపై మీ క్రెడిట్ లైన్ పరిమితిపై ఓ నిర్ణయం తీసుకుంటారు.