BJP | న్యూఢిల్లీ, జూన్ 5: ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సీట్లు తగ్గడం.. సంస్కరణల అమలుకు సవాల్‌గా మారిందని ప్రముఖ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీలు బుధవారం అభిప్రాయపడ్డాయి. 2014, 2019 ఎన్నికల్లో కేంద్రం లో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేంత సీట్లను బీజేపీ గెల్చుకున్న విషయం తెలిసిందే. నాడు 282, 303 చొప్పున పార్లమెంట్ స్థానాలను బీజేపీ నెగ్గింది. అయితే ఈ దఫా (2024) ఎన్నికల్లో మాత్రం సీన్ రివర్సైంది.
400 పార్లమెంట్ స్థానాలు లక్ష్యంగా బరిలోకి దిగిన మోదీ సర్కారుకు ఓటర్లు పెద్ద షాకే ఇచ్చారు. 240 సీట్లకే కాషాయ దళాన్ని పరిమితం చేశారు. ఫలితంగా లోక్‌సభ (543)లో మ్యాజిక్ ఫిగర్ (272)ను అందుకోవాలంటే ఎన్డీయే కూటమిలోని మిత్ర పక్షాల మద్దతు తప్పనిసరైంది.
బీజేపీ, భాగస్వామ్య పక్షాలకు కలిపి 293 సీట్లు వచ్చిన సంగతి విదితమే. దీంతో ప్రతీ విషయంలో ఇక అందరినీ కలుపుకొనిపోవాల్సిన పరిస్థితి బీజేపీకి ఏర్పడింది. ఇన్నాళ్లూ ఒంటెత్తు పోకడతో దుందుడుకు నిర్ణయాలు తీసుకున్న మోదీ సర్కారు.. ఇకపై ఆచితూచి అడుగులు వేయాల్సిందే. ఈ నేపథ్యంలో ఆర్థిక సంస్కరణల అమలు, పాలసీ నిర్ణయాలు చకచకా జరిగేలా లేవని, గతంతో పోల్చితే ఆలస్యమవుతాయని ఫిచ్ రేటింగ్స్, మూడీస్ అంచనాకొస్తున్నాయి.
ఉద్యోగ కల్పన కష్టమే?
గడిచిన పదేండ్ల సంగతి ఎలా ఉన్నా.. రాబోయే ఐదేండ్లు మాత్రం కేంద్రంలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వంపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుందన్నది నిర్వివాదాంశం. ఎందుకంటే స్పష్టమైన మెజారిటీ ఏ పార్టీకీ రాకపోవడం వల్లే. దీంతో ఈ దఫా మోదీ సర్కారు ముందు అనేక సవాళ్లున్నాయని రేటింగ్ ఏజెన్సీలు హెచ్చరిస్తున్నాయిప్పుడు. ప్రధానంగా ఉద్యోగ కల్పన కష్టమేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టాలన్నా, వృద్ధిరేటు ఇంకా పుంజుకోవాలన్నా.. సంస్కరణల అమలే కీలకమని ఫిచ్ గ్రూప్ సంస్థ బీఎంఐ అంటున్నది. గతంతో పోల్చితే ఈసారి మెజారిటీ తగ్గడం..
దేశ ప్రజలు ఇకనైనా కేంద్ర ప్రభుత్వం హిందుత్వ ఎజెండాను వీడి, ఉద్యోగ-ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడంపై, ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంపై దృష్టి పెట్టాలని కోరుకోవడానికి సంకేతమేనన్న అభిప్రాయాన్ని బీఎంఐ ఆసియా అధిపతి డారెన్ టే వెలిబుచ్చారు. ఈ క్రమంలోనే బాల రాముడి ఆలయాన్ని నిర్మించిన అయోధ్య నగరం ఉన్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ కేవలం 33 సీట్లనే ఈసారి గెల్చుకున్నదని, 2019లో ఇక్కడ 63 స్థానాలను దక్కించుకున్నదని గుర్తుచేస్తున్నారు.
అంతంతమాత్రంగానే..
దేశంలోని అన్ని రంగాల్లో యువతను నిరుద్యోగ సమస్య భారీగా వేధిస్తున్నదని మూడీస్ తెలిపింది. వ్యవసాయ రంగంలో ఉత్పాదక రేటు కూడా తగ్గిపోయిందన్నది. ఇక ఆర్థిక క్రమశిక్షణ ఉంటేనే వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26)కల్లా దేశ జీడీపీలో ద్రవ్యలోటును 4.5 శాతానికి పరిమితం చేయగలరని పేర్కొన్నది. ప్రస్తుతం ఇండోనేషియా (బీఏఏ2 స్టేబుల్), ఫిలిప్పీన్స్ (బీఏఏ2 స్టేబుల్), థాయిలాండ్ (బీఏఏ1 స్టేబుల్)తోపాటు బీఏఏ రేటింగ్ ఉన్న ఇతర దేశాలతో పోల్చితే భారత ఆర్థిక పరిస్థితి ఏమంత బాగాలేదని కూడా చెప్పడం గమనార్హం. అధిక వడ్డీరేట్లు, ద్రవ్యోల్బణం కూడా ప్రధాన సమస్యగా ఉన్నాయని మూడీస్ గుర్తుచేసింది.
అభివృద్ధికి పెద్దపీట వేయాలి
కేంద్రంలో మిత్ర పక్షాల మద్దతుతో మూడోసారి గద్దెనెక్కుతున్న మోదీ సర్కారు.. అభివృద్ధికి పెద్దపీట వేయాలని భారతీయ వ్యాపార, పారిశ్రామిక రంగాల పెద్దలు కోరుతున్నారు. మౌలికాభివృద్ధి, తయారీ రంగం కీలకమని, వీటికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు అందించాలని సూచిస్తున్నారు. కాగా, ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో కూడా పాలసీ నిర్ణయాలు సజావుగా సాగగలవన్న ఆశాభావాన్ని మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ వ్యక్తం చేశారు.
అయితే రాబోయే బడ్జెట్లో నిర్ణయాలు భవిష్యత్తుపై ఓ స్పష్టతనిస్తాయని మరికొందరు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. దేశంలోకి కొత్త పెట్టుబడులు రావాలన్నా.. పారిశ్రామికాభివృద్ధి జరుగాలన్నా.. వేగవంతమైన, సాహసోపేతమైన నిర్ణయాలు అవసరమని, కూటమి పాలనలో ఇది సాధ్యమేనా? అన్న అనుమానాలనూ వారు కనబరుస్తున్నారు.
భారత్‌లో కొత్త ప్రభుత్వం బీజేపీ నేతృత్వంలోని ఏన్డీయే కూటమి ఆధ్వర్యంలో ఏర్పడే అవకాశాలున్నాయి. దీంతో మరోసారి ప్రధానిగా మోదీనే రాబోతున్నారని చెప్పవచ్చు. బీజేపీకి తగ్గిన మెజారిటీ.. పాలనాపరమైన సవాళ్లకు, ముఖ్యంగా ఆర్థిక సంస్కరణల అమలుకు బ్రేక్ వేస్తుందనిపిస్తున్నది.
-ఫిచ్ రేటింగ్స్
ఈసారి బీజేపీకి పూర్తిస్థాయి మెజారిటీ లేదు. దీనివల్ల ఆర్థిక సంస్కరణల అమలు ఆలస్యం కావచ్చు. ఇది ఆర్థిక క్రమశిక్షణనూ దెబ్బతీయవచ్చు. అయితే భాగస్వామ్య పక్షాల మద్దతు బలంగా ఉంటే మాత్రం కీలక రంగాల ప్రగతికి ఢోకా ఉండదనే భావిస్తున్నాం.
-మూడీస్