ముంబై, జూలై 28: కీలక వడ్డీరేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరోసారి పెంచుతుందన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. రాబోయే ద్రవ్యసమీక్షలో రెపోరేటు 0.35-0.5 శాతం మేర పెరగవచ్చని యాక్సిస్ బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త సౌగతా భట్టాచార్య అంటున్నారు. వచ్చే వారం ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష జరగనున్నది. ఈ క్రమంలోనే రెపోరేటు అర శాతం పెరిగే వీలుందని గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రెపోరేటు 4.9 శాతంగా ఉన్నది. అయితే వచ్చే వారం ఆర్బీఐ సమీక్ష తర్వాత 5.15 శాతాన్ని దాటిపోవచ్చని, ఈ క్రమంలోనే వచ్చే ఏడాది మార్చి ఆఖరు నాటికి 5.75 శాతానికి చేరవచ్చని భట్టాచార్య చెప్తున్నారు. మే, జూన్ నెలల్లో రెపోరేటు ఏకంగా 0.9 శాతం పెరిగిన విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో తగ్గించిన రెపోరేటును ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా ఆర్బీఐ వేగంగా పెంచుతూపోతున్నదిప్పుడు. కాగా, అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్సహా చాలా దేశాల కేంద్ర బ్యాంక్లు వడ్డీరేట్లను పెంచుతూపోతున్నాయని గుర్తుచేశారు. ప్రధాన ద్రవ్యోల్బణం ఎన్నో నెలల నుంచి 6 శాతాన్ని దాటే నమోదవుతున్నది. అటు హోల్సేల్, ఇటు రిటైల్ ధరల సూచీలు రికార్డు స్థాయిలకు చేరిన నేపథ్యంలో వడ్డీరేట్ల పెంపు ఆర్బీఐకి అనివార్యంగా మారుతున్నదని అంటున్నారు. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) దేశ జీడీపీ 7.1 శాతంగా నమోదు కావచ్చని భట్టాచార్య అంచనా వేశారు.
రుణాలు మరింత భారం
ఆర్బీఐ రెపోరేటును ఇంకా పెంచితే గృహ, ఆటో తదితర అన్ని రుణాలు భారం కానున్నాయి. ఇప్పటికే ఈఎంఐలు, రుణ కాలపరిమితులు పెరిగి రుణగ్రహీతలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వచ్చే ద్రవ్యసమీక్షలోనూ రెపోరేటు పెరిగితే బ్యాంకులు ఆయా రుణాలపై తదనుగుణంగా వడ్డీరేట్లను పెంచడం ఖాయం. ఇదే జరిగితే ప్రస్తుత రుణగ్రహీతలపై పెనుభారమే పడుతుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అటు నిర్మాణ, వాహన పరిశ్రమలకూ దెబ్బేనని చెప్తున్నారు.