హైదరాబాద్, డిసెంబర్ 23: రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్నది. వచ్చే ఐదేండ్లకాలంలో రూ.35 వేల కోట్ల ఆర్డర్లు లక్ష్యంగా పెట్టుకున్నట్టు కంపెనీ సీఈవో సునీల్ నాయర్ తెలిపారు. ప్రస్తుతం కంపెనీ చేతిలో వాటర్, వాటర్వేస్ట్, ఇండస్ట్రియల్ పార్క్, అర్బన్ సొల్యూషన్స్ విభాగాలకు చెందిన రూ.10 వేల కోట్ల విలువైన ఆర్డర్లు ఉన్నాయన్నారు. వచ్చే రెండు నుంచి రెండున్నరేండ్ల కాలంలో ఈ ప్రాజెక్టులను పూర్తి చేయనున్నట్టు, చిన్న ప్రాజెక్టులతోపాటు పెద్ద ప్రాజెక్టులపై దృష్టి సారించినట్టు చెప్పారు. వీటితోపాటు త్వరలో బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని, వీటిలో రూ.1,000 కోట్ల విలువైన అంతర్జాతీయ ఆర్డర్లు కూడా ఉన్నాయన్నారు.
అలాగే మహారాష్ట్రలో రూ.3 వేల కోట్ల విలువైన లైఫ్‌సైన్సెస్ ప్రాజెక్టుకు కూడా తుది దశకు చేరుకున్నదని, వచ్చే ఏడాది తొలి త్రైమాసికం నాటికి ఒప్పందం జరిగే అవకాశాలున్నాయన్నారు. పలు జాతీయ బ్యాంకుల వద్ద తీసుకున్న రూ.3,800 కోట్ల రుణాన్ని ప్రమోటర్లు పూర్తిగా చెల్లించారని, దీంతో సంస్థ రుణ రహితంగా నిలిచిందని చెప్పారు. మరోవైపు, డాటా సెంటర్ల నిర్వహణపై కూడా దృష్టి సారించినట్టు, ఇందుకోసం ఒక ప్రైవేట్ సంస్థతో చర్చలు జరుపుతున్నట్టు, వచ్చే ఏడాది చివరి నాటికి ఇది పట్టాలెక్కే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. సంస్థ ఇటీవల కాలంలో మెరుగైన పనితీరు కనబరుస్తున్నదని, యేటా 25-30 శాతం వృద్ధిని సాధించినట్టు చెప్పారు.