కాజీపేట, జూలై 17: కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలో నిర్మిస్తున్న రైల్వే మల్టీ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ (ఆర్ఎంయూ) పనులు వేగంగా జరుగుతున్నాయని, వచ్చే మార్చి నాటికి ప్రారంభించాలనుకుంటున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ వెల్లడించారు. జీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆయన కాజీపేటకు వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా రైల్వే సర్క్యూలేటింగ్ ఏరియా, అమృత్ భారత్ పథకం పనులను క్షుణ్ణంగా పరిశీలించారు.
అయోధ్యపురం శివారులో నిర్మిస్తున్న ఈ యూనిట్‌ను సందర్శించి సంబంధిత అధికారులతో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. షెడ్డులో నిర్మాణ పనులను పరిశీలించి, వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణ పనులు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతాయని, వెంటనే ట్రయల్న్ నిర్వహించనున్నట్లు తెలిపారు. 160 ఎకరాల స్థలంలో రూ.716 కోట్లతో నిర్మిస్తున్న ఈ యూనిట్లో తొలి ఏడాది 600 బోగీలు, ఆ తర్వాత ఏడాదిలో 2,400 బోగీలు తయారుకానున్నాయి.