
Railway Fares | విమానాశ్రయాలు.. ఇండియన్స్‌తోపాటు విదేశీయులు వచ్చిపోతుంటారు. ఎయిర్‌పోర్ట్‌లు మన స్టేటస్‌కు సింబల్స్.. వీటిల్లో వసతుల కల్పనతోపాటు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచడానికి ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ చార్జీలు లేదా యూజర్ చార్జీలు వసూలు చేస్తున్నారు. ఆ బాటలోనే భారతీయ రైల్వేస్ పయనిస్తున్నాయి. రైల్వే స్టేషన్ల రీ-డెవలప్మెంట్ కోసం స్టేషన్ డెవలప్మెంట్ ఫీజు (ఎస్డీఎఫ్) లేదా యూజర్ ఫీజు వసూలు చేయాలని ఇటీవల జరిగిన రైల్వే బోర్డు సమావేశం నిర్ణయించింది. ఈ ఫీజు రూ.10-50 మధ్య ఉంటుందని అంచనా. ఈ ఫీజుతో సమీప భవిష్యత్‌లో రైల్వే స్టేషన్లను రీడెవలప్ చేయనున్నారు. ఎస్డీఎఫ్ నేపథ్యంలో రైల్వే టికెట్ల ధరలు పెరుగనున్నాయని తెలుస్తున్నది.
ప్రయాణికులు రైలు ఎక్కిన స్టేషన్‌తోపాటు దిగిన స్టేషన్లోనూ ఈ చార్జీలు వసూలు చేయబోతుండటం ఆసక్తికర అంశం. ఈ మేరకు రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ ఫీజు (ఎస్డీఎఫ్)ను ఖరారు చేసేందుకు రైల్వే బోర్డు నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దీని ప్రకారం స్టేషన్ డెవలప్మెంట్ యూనిట్లుగా రైల్వే జోనల్ కార్యాలయాలు ఉంటాయి. ఈ ఫీజు వసూలు చేయడానికి 120 రోజుల ముందు ఆయా స్టేషన్ల పరిధిలో ప్రయాణికులకు తెలియజేయాలని ఆయా స్టేషన్ల కమర్షియల్ యూనిట్లకు జోన్లు సమాచారం ఇచ్చాయి.
ఈ స్టేషన్ల డెవలప్మెంట్ ఫీజుతోపాటు రీ డెవలప్‌చేసిన స్టేషన్లలో ప్లాట్‌ఫామ్ టికెట్ ధరలు రూ.10లకు పెరుగుతాయి. రైల్వే స్టేషన్లను రీ డెవలప్‌చేసే ప్రైవేట్ సంస్థలకు ఆదాయమార్గంగా ఈ ఎస్డీఎఫ్ను రైల్వే మంత్రిత్వశాఖ గతేడాది ఆమోదించింది. ఎస్డీఎఫ్ అమల్లోకి వస్తే రైల్వే స్టేషన్ల రీ డెవలప్మెంట్, మౌలిక వసతుల కల్పనకు బిడ్లు దాఖలు చేసేందుకు ప్రైవేట్ సంస్థలకు ప్రోత్సాహకరంగా ఉంటుందని రైల్వేశాఖ ఆశలు పెట్టుకున్నది. ప్రభుత్వ నిధులతో ప్రాజెక్టులు చేపడితే, రైల్వేలకు ఎస్డీఎఫ్ అదనపు ఆదాయం కానున్నది.
ఎస్డీఎఫ్ వసూలు చేయాలని రైల్వే బోర్డు తీసుకున్ననిర్ణయంతో రైలు టికెట్ల ధరలు పెరుగనున్నాయి. మీరు రెండు రీడెవలప్డ్ రైల్వే స్టేషన్ల మధ్య ప్రయాణిస్తే.. రెండు చోట్ల ఎస్డీఎఫ్ చెల్లించాల్సి ఉంటుంది. మీ గమ్యస్థానం.. లేదా బయలుదేరే స్టేషన్లలో ఒకటి మాత్రమే రీడెవలప్ అయితే, ఒక్క స్టేషన్‌కే ఎస్డీఎఫ్ చెల్లించాలి. తొలుత 50 రైల్వే స్టేషన్లలో ఎస్డీఎఫ్ను రైల్వేశాఖ అమలు చేయనున్నది. తదుపరి దశలో ఇతర స్టేషన్లకు విస్తరించనున్నది.
విమాన ప్రయాణికులకు టికెట్ ధరతో ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ ఫీజు వసూలు చేసినట్లే.. రైల్వే ఎస్డీఎఫ్ కూడా టికెట్‌తో కలిపి వసూలు చేస్తారు. ఎస్డీఎఫ్ మూడు రకాలుగా ఉంటుంది. ఏసీ క్లాస్ ప్రయాణికులకు అత్యధికగా రూ.50, స్లీపర్ క్లాస్‌కు రూ.25, అన్ రిజర్వుడ్ అంటే జనరల్ క్లాస్ ప్రయాణికులకు రూ.10 వడ్డిస్తారు. అయితే, సబర్బన్ రైలు ప్రయాణాలకు మాత్రం ఈ ఎస్డీఎఫ్ వర్తించదు. ఆయా స్టేషన్లలో ఎస్డీఎఫ్ను రైల్వేశాఖ నిర్ణయిస్తుంది. దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో ఎయిర్‌పోర్ట్స్ ఎకనమిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఈఆర్ఏ), ఇతర విమానాశ్రయాల్లో పౌర విమానయాన శాఖ ఎస్డీఎఫ్ ఖరారు చేస్తాయి.