న్యూఢిల్లీ, జనవరి 28: రాబోయే బడ్జెట్ తప్పనిసరిగా దూరదృష్టి కలిగిన లక్ష్యాలతో ఉండాలని, వాటి సాధనకు బాటలు వేసేదిగా నిలువాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. అప్పుడే భారత ఆర్థిక వ్యవస్థ మరింత స్వతంత్రంగా, బలోపేతంగా మారగలదని అభిప్రాయపడ్డారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2026-27)గాను ఫిబ్రవరి 1న పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో బుధవారం పీటీఐ వీడియోస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజన్ మాట్లాడుతూ.. కృత్రిమ మేధస్సు (ఏఐ)లో అద్భుతమైన పెట్టుబడులకు వీలుండి, గొప్ప వృద్ధి అవకాశాలు కనిపిస్తున్నా ప్రస్తుతం భారత్, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రెండింటికీ అత్యంత ప్రమాదకర సమయమే నడుస్తున్నదని చెప్పారు.
అందుకే ఈ క్లిష్ట పరిస్థితులను జయించేలా బడ్జెట్ ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ఈసారి బడ్జెట్ ఆ తరహాలోనే ఉంటుందన్న ఆశాభావాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. కాగా, గతంలోనూ భారత్కు ఐదేండ్ల ప్రణాళికలు ఉండేవని, కానీ అప్పుడు కూడా బడ్జెట్ వాటికి తగినట్టుగా ఉండేది కాదని రాజన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం. ఇదిలావుంటే భౌగోళిక-రాజకీయ ఒడిదుడుకుల నడుమ దేశ జీడీపీని పరుగులు పెట్టించేలా బడ్జెట్ ఉంటుందన్న ఆకాంక్షను వెలిబుచ్చారు. దిగుమతి సుంకాలు తగ్గితే సరఫరా వ్యవస్థ మరింత మెరుగుపడగలదన్నారు.