హైదరాబాద్, డిసెంబర్ 15: దేశీయ రక్షణ తయారీ వ్యవస్థను పటిష్ఠం చేయడంలో భాగంగా కొత్త డీప్‌టెక్ డిజైన్, ఉత్పత్తి, ఇంటిగ్రేషన్ కేంద్రాన్ని హైదరాబాద్‌లోని హార్డ్‌వేర్ పార్క్‌లో ప్రారంభించినట్టు రఘు వంశీ ఏరోస్పేస్ గ్రూపు ప్రకటించింది. అలాగే రక్షణ దళాల కోసం ఆరు కొత్త యూఏవీ, అటానమస్ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా కంపెనీ ఫౌండర్, ఎండీ వంశీ వికాస్ మాట్లాడుతూ..రూ.100 కోట్ల పెట్టుబడితో 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పిన ఈ సిటాడెల్ ఏరోస్పేస్ క్యాంపస్‌లో యూఏఏలు, ఇంజిన్లు, అధునాతన రక్షణ వ్యవస్థ కోసం ఉత్పత్తులను తయారు చేసినట్టు చెప్పారు.
వీటిలో జెట్-పవర్డ్ లోయిటరింగ్ మ్యూనిషన్స్, డికాయ్ డ్రోన్లు, టెథర్డ్ సర్వేలైన్ డ్రోన్లు, ఎయిర్-బేస్డ్ క్షిపణులు, మైక్రో-టర్బోజెట్ ఇంజిన్లులు ఉన్నాయి. ఈ ఉత్పత్తులు 650 కిలోమీటర్ల వేగంతో 300 కిలోమీటర్లకు మించి పరిధిని కలిగివుంటాయన్నారు. మరోవైపు, జీఎమ్మార్ ఏరోపార్క్‌లో రూ.300 కోట్ల పెట్టుబడితో నెలకొల్పిన ప్లాంట్ వచ్చే ఏడాది చివరినాటికి అందుబాటులోకి రానున్నట్టు చెప్పారు.
ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పిన ఈ యూనిట్‌తో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. నెలకు 500 ఉత్పత్తి సామర్థ్యం ఈ యూనిట్ కలిగివుందన్నారు. ప్రస్తుతం సంస్థకు భారత్‌తోపాటు అమెరికా, బ్రిటన్లలో 10 తయారీ కేంద్రాలు ఉన్నాయి.