హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): రోగ నిర్ధారణలో రేడియో ఐసోటోప్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని బాబా అణు పరిశోధనా సంస్థలోని రేడియో ఫార్మాస్యూటికల్ విభాగానికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ మాధవ బీ మల్లియా తెలిపారు. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్‌లో ‘రేడియో కెమిస్ట్రీ, అప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోప్’పై నిర్వహిస్తున్న ఐదు రోజుల జాతీయ వర్క్‌షాప్‌లో మంగళవారం ఆయన ప్రసంగించారు. కేవలం ఆరు గంటలు బతికే టెక్నీషియం-99ఎం, 66 గంటలపాటు జీవించే మాలిబ్డినం-99 వంటి రేడియో ఐసోటోప్లు రోగ నిర్ధారణలో చాలా ముఖ్యమైనవని చెప్పారు. న్యూక్లియర్ మెడిసిన్‌లో ‘వర్క్ హార్స్’గా పిలిచే టెక్నీషియం-99ఎంను వినియోగించి దాదాపు 80 శాతానికిపైగా రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారని వివరించారు.