న్యూఢిల్లీ, డిసెంబర్ 24: క్విక్ కామర్స్ సేవలనుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోవాలంటే కిరాణా స్టోర్లకు వెంటనే మెరుగైన సాంకేతిక సేవలు అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రిటైలర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్ఆర్ఏఐ) కోరుతున్నది. క్విక్ కామర్స్ సేవలను ఇప్పటికే స్విగ్గీ, బ్లింకిట్, జెప్టోలు ప్రారంభించాయని, దీంతో కొనుగోలుదారులు ఇంటికే పరిమితమయ్యే అవకాశాలున్నాయని, ఈ నేపథ్యంలో కిరాణా దుకాణాదారులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉన్నదని, వెంటనే కేంద్రం జోక్యం చేసుకొని కిరాణా దుకాణాదారులకోసం ప్రత్యేకంగా టెక్నాలజీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 42 రిటైల్ అసోసియేషన్ కింద 80 లక్షల మైక్రో, చిన్న మధ్యతరహా రిటైలర్లు ఉపాధి పొందుతున్నారు. ఇప్పటికే కిరాణా దుకాణాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని, నూతన కస్టమర్లను అవసరాలను తీర్చడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు, ఇప్పుడు క్విక్ కామర్స్ కూడా ప్రవేశించడంతో వీటిపై పిడుగుపడినట్లు అయిందని ఎఫ్ఆర్ఏఐ ప్రతినిధి మిశ్రా తెలిపారు. కిరాణా స్టోర్ల కంటే క్విక్ కామర్స్ సంస్థలు అధికంగా రాయితీలు ఇస్తున్నాయని, అతిపెద్ద గిడ్డంగులు, అధిక కస్టమర్లు కలిగివుండటంతో వీటిపై ప్రతికూల ప్రభావం పడనున్నదన్నారు. క్విక్ కామర్స్ సంస్థలు ప్రవేశించడంతో పోటీ మరింత పెరిగిందన్నారు.