హైదరాబాద్, ఆగస్టు 26: అమెరికాకు చెందిన డిజిటల్ క్వాల్టీ ఇంజినీరింగ్ సేవల సంస్థ క్వాలిజేల్.. హైదరాబాద్‌లో తన రెండో డెలివరీ సెంటర్‌ను ప్రారంభించింది. 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ డెలివరీ సెంటర్లో 200 మంది కూర్చోవడానికి వీలుంటుంది. భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తెలంగాణ చైర్మన్ సీ శేఖర్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కంపెనీ సీఈవో ప్రదీప్ గోవిందస్వామి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఈ సెంటర్లో 200 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారని, భవిష్యత్తులో ఈ సంఖ్యను 500కి పెంచుకోనున్నట్లు ప్రకటించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో నగరంలో రెండో కార్యాలయాన్ని తెరిచినట్లు, తద్వారా మరిన్ని క్లయింట్లు ఆకట్టుకోవడానికి వీలు పడనున్నదన్నారు. భారతలో వ్యాపార విస్తరణకోసం 3 మిలియన్ డాలర్ల(రూ. 250 కోట్లు) పెట్టుబడిగా పెట్టబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. టెక్నాలజీ రంగంలో ఉద్యోగ అవకాశాలు భారీగా ఉన్నాయని, ముఖ్యంగా ఇంజినీరింగ్ చదివే విద్యార్థులకు వచ్చే ఉపాధి అవకాశాల మధ్య అంతరం ఎక్కువగా ఉన్నదన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యాలయాలను అంతర్జాతీయ డెలివరీ సెంటర్, టెక్నాలజీ హబ్‌గా మారుస్తున్నట్లు చెప్పారు.
మౌలిక వసతులు భేష్
హైదరాబాద్‌లో మౌలిక వసతులు భేషుగ్గావున్నాయని శేఖర్ రెడ్డి అన్నారు. నగరంలో జీవన వ్యయం చాలా తక్కువగా ఉండటంతో కార్పొరేట్ సంస్థలు, ఉద్యోగులు ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. క్వాలిజేల్ రెండో ఆఫీస్‌ను ఇక్కడ ప్రారంభించడం మంచి పరిణామమని, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారిందని తెలిపారు.