Prime Minister Narendra Modi | క్వాడ్ కూటమి భాగస్వామ్య దేశాలు తమ దేశాల ప్రజల మధ్య సన్నిహిత సంబంధాలు, దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంతోపాటు అనుబంధం బలోపేతానికి అంకితమై పని చేస్తున్నామని సంకేతాలిచ్చాయి. ఇందులో భాగంగా క్వాడ్ భాగస్వామ్య దేశంగా భారత్ ప్రధాని నరేంద్రమోదీ కొత్త ఇన్షియేటివ్ ప్రారంభించారు. ఇండో-పసిఫిక్ ప్రాంత దేశాలకు చెందిన 50 మంది విద్యార్థులకు ఐదు లక్షల డాలర్ల ‘క్వాడ్ స్కాలర్ షిప్’ ప్రకటించారు. భారత ప్రభుత్వ నిధులతో పని చేస్తున్న ఇంజినీరింగ్ కాలేజీల్లో నాలుగేండ్ల బీటెక్ కోర్సు పూర్తి చేసే ఇండో-పసిఫిక్ ప్రాంత విద్యార్థులకు ఈ స్కాలర్ షిప్ అందిస్తారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ డెలావేర్ రాష్ట్రంలోని తన సొంత నగరం విల్మింగ్టన్లో క్వాడ్ దేశాధి నేతలకు ఆదివారం విందునిచ్చారు. ఈ విందు సమావేశంలో ఆస్ట్రేలియా ప్రధాని అంథోనీ అల్బానీస్, భారత ప్రధాని నరేంద్రమోదీ, జపాన్ ప్రధాని కిషిద ఫుమియో, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాల్గొన్నారు. నాలుగో క్వాడ్ సదస్సు సందర్భంగా భాగస్వామ్య దేశాల అధినేతలు సూత్రప్రాయంగా సమావేశం అయ్యారు.