న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో దేశ జీడీపీ వృద్ధిరేటు 6.4 శాతంగా నమోదు కావచ్చని భారతీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 6.7 శాతంగా ఉంటే.. రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో ఏకంగా ఏడు త్రైమాసికాల కనిష్ఠాన్ని తాకుతూ 5.4 శాతంగానే ఉన్న విషయం తెలిసిందే. ఇందుకు మార్కెట్లో డిమాండ్ బలహీనపడటం, కేంద్ర ప్రభుత్వ మూలధన వ్యయం తగ్గిపోవడం కారణంగా పేర్కొన్న ఇక్రా.. ప్రస్తుతం ఈ రెండు అంశాల్లో పరిస్థితులు మెరుగయ్యాయని అంటున్నది. అందుకే వృద్ధిరేటు అంచనా 6.4 శాతంగా నమోదు కావచ్చని చెప్పింది. కాగా, ఈ నెల 28న అక్టోబర్-డిసెంబర్ త్రైమాసిక జీడీపీ వృద్ధి గణాంకాలను ఎన్ఎస్వో అధికారికంగా ప్రకటించనున్నది. కాగా, ఆర్బీఐ వృద్ధి అంచనా ఈసారికి 6.6 శాతంగా ఉన్నది.