న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: దేశ ఆర్థిక రంగ పరుగులకు బ్రేక్‌పడింది. గనులు, తయారీ రంగాలతోపాటు ఇతర రంగాల్లో నెలకొన్న నిస్తేజం కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(అక్బోర్-డిసెంబర్ మధ్యకాలం)లో దేశ స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) 6.2 శాతానికి పరిమితమైందని కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. వ్యవసాయరంగం మినహా అన్ని రంగాల్లో వృద్ధి అంతంత మాత్రంగానే నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన 9.5 శాతం వృద్ధితో పోలిస్తే భారీగా పతనం చెందగా..కానీ, రెండో త్రైమాసికంలో నమోదైన 5.6 శాతంతో పోలిస్తే మాత్రం మెరుగుపడినట్లు కేంద్ర గణాంకాల శాఖ కార్యాలయం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. కేంద్ర సర్కార్ విడుదల చేసిన ముందస్తు అంచనాలకు కూడా చేరుకోలేకపోవడం విశేషం.
దేశీయ ఆర్థిక వ్యవస్థలో కీలకంగావున్న తయారీ రంగం పడకేసింది. మూడో త్రైమాసికానికిగాను ఈ రంగంలో వృద్ధి 3.5 శాతానికి పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇది 14 శాతంగా ఉంది. తయారీ రంగంతోపాటు గనులు, క్వారింగ్ ప్రొడక్షన్ కూడా నెమ్మదించాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో 4.7 శాతం వృద్ధిని కనబరిచిన గనులు..ఈసారికిగాను 1.4 శాతానికి పరిమితమయ్యాయి. అలాగే నిర్మాణ రంగ పనితీరు కూడా 10 శాతం నుంచి 7 శాతానికి పడిపోయింది. వ్యవసాయ రంగం మాత్రం 1.5 శాతం నుంచి 5.6 శాతానికి ఎగిసినట్లు వెల్లడించింది. విద్యుత్, గ్యాస్, నీటి సరఫరాతోపాటు యుటిలిటీ సేవల రంగం 5.1 శాతానికి నమోదైందని పేర్కొంది.
2047 నాటికి వికసిత్ భారత్‌గా దేశం అవతరించాలంటే ప్రతియేటా భారత్ 7.8 శాతం వృద్ధిని సాధించాల్సిన అవసరం ఉన్నదని ప్రపంచబ్యాంక్ వ్యాఖ్యానించింది. ఈ లక్ష్యానికి చేరుకోవాలంటే జాతీయ ఆదాయం ప్రస్తుత స్థాయి కంటే దాదాపు ఎనిమిది రెట్లు పెరగాలని, అలాగే ఆర్థిక రంగంతో పాటు భూ, కార్మిక రంగాల్లో మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చినప్పుడే ఇది సాధ్యమవుతుందని వెల్లడించింది. 2000 నుంచి 2024 మధ్యకాలంలో భారత్ సగటున 6.3 శాతం వృద్ధిని సాధించింది.