Car Sales | కొత్త సంవత్సరం ప్రారంభంలోనూ వాహనాల విక్రయాల్లో పాజిటివ్ ధోరణి కనిపించింది. కార్ల విక్రయాల్లో 13.3 శాతం గ్రోత్ రికార్డైంది. 2023 జనవరిలో 3,47,086 కార్లు అమ్ముడైతే గత నెలలో 3,93,250 యూనిట్లు అమ్ముడు పోయాయని ఆటోమొబైల్ డీలర్ సంఘాల సమాఖ్య (ఫాడా) తెలిపింది. ఎస్యూవీ కార్లలో కొత్త మోడల్స్ ఆవిష్కరించడం, వాటి లభ్యత, సమర్థవంతమైన మార్కెటింగ్ తోపాటు కొనుగోలుదారులకు ఆకర్షణీయ కన్జూమర్ స్కీమ్‌లు, పెండ్లిండ్ల సీజన్ కావడంతో ఎస్యూవీ కార్లకు డిమాండ్ పెరిగిందని ఫాడా అధ్యక్షుడు మనీష్ రాజ్ సింఘానియా తెలిపారు. భారీగా కార్ల విక్రయాలు జరుగుతున్నా, కార్లు బుక్ చేసుకున్న వారు డెలివరీ కోసం 50-55 రోజులు వెయిట్ చేయాల్సి వస్తుందన్నారు. కనుక కార్ల తయారీ సంస్థలు మార్కెట్లో డిమాండ్‌ను బట్టి భవిష్యత్‌లో సరఫరా సమస్యలు తలెత్తకుండా కార్ల ఉత్పత్తి సామర్థ్యం పెంచడానికి తక్షణం నిర్ణయం తీసుకోవాలన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోళ్లు పెరగడంతో టూ వీలర్స్ సేల్స్ 15 శాతం పెరిగి 14,58,849 యూనిట్లకు చేరాయి. కానీ, కమర్షియల్ వెహికల్స్ సేల్స్ ఫ్లాట్‌గా సాగి, 89,208 యూనిట్లకు చేరాయి. ఎలక్ట్రికల్ వెహికల్స్ తోపాటు త్రీ వీలర్స్ సేల్స్ లో 37 శాతం పురోగతి నమోదైంది. 2023 జనవరిలో 71,325 త్రీ వీలర్స్ అమ్ముడైతే, గత నెలలో 97,675 యూనిట్లు అమ్ముడు పోయాయి. ట్రాక్టర్ సేల్స్ 21శాతం పెరిగి 88,671 యూనిట్లకు చేరాయి. మొత్తం వాహనాల విక్రయాల్లో 15 శాతం గ్రోత్ నమోదైంది. గతేడాది జనవరిలో 18,48,691 వాహనాలు అమ్ముడైతే గత నెలలో 21,27,653 వాహనాలు అమ్ముడయ్యాయి.