హైదరాబాద్, జూన్ 11: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ).. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)లకు రూ.25 లక్షలదాకా సులభతర డిజిటల్ లోన్లను మంజూరు చేస్తామన్నది. పీఎన్బీ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చని, ఇందుకు ఎలాంటి డాక్యుమెంట్లు, పత్రాలు అవసరం లేదని, వ్యక్తిగత వివరాలు సమర్పిస్తే చాలని పీఎన్బీ ఎండీ, సీఈవో అశోక్ చంద్ర తెలిపారు. బుధవారం ఇక్కడ ఓ హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అంతా సక్రమంగా ఉంటే పీఎన్బీ ఖాతాదారులకు కేవలం 10 నిమిషాల్లో రుణం మంజూరుకు సంబంధించిన సమాచారం వస్తుందన్నారు.
కొత్త కస్టమర్లకు 24 గంటల సమయం పడుతుందన్నారు. కాబట్టి ఈ సదావకాశాన్ని అంతా వినియోగించుకోవాలని కోరారు. ఇక స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జీ)కూ రుణ సాయం చేస్తామని, ఎస్‌హెచ్‌జీ సభ్యులైతే వ్యక్తిగతంగా కూడా లోన్లు వస్తాయని చెప్పారు. ఇదిలావుంటే ఇటీవలి ద్రవ్యసమీక్షలో నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 100 బేసిస్ పాయింట్లు తగ్గించడం వల్ల బ్యాంక్‌కు దాదాపు రూ.15,000 కోట్ల నగదు నిల్వలు అందనున్నాయన్నారు. వీటిని రుణాల వృద్ధికి వినియోగిస్తామని చెప్పారు. అలాగే రిటైల్, వ్యవసాయం, ఎంఎస్ఎంఈ రంగాలకు రుణాలపై దృష్టి పెట్టినట్టు స్పష్టం చేశారు.