న్యూఢిల్లీ, మే 30: ఆతిథ్య రంగంలో పన్నులు ఎక్కువగా విధిస్తున్నారని ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ ఎండీ, సీఈవో పునీత్ చత్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ పర్యాటకులను భారత్ విశేషంగా ఆకర్షించగలదని, అయితే అధిక పన్నులు ఈ అవకాశాన్ని దెబ్బతీస్తున్నాయని ఆయన ఒకింత ఆవేదన వెలిబుచ్చారు. దేశీయ ఆతిథ్య రంగంలో ప్రపంచస్థాయి బ్రాండ్ల రాకకు కూడా ఇది ఇబ్బందికరంగా మారిందన్నారు. ఇక్కడ జరిగిన సీఐఐ వార్షిక వ్యాపార సదస్సులో ఆయన మాట్లాడుతూ.. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ వస్తు, సేవల పన్ను (జీఎస్టీ), ఎక్సైజ్, ఇతర అన్ని చార్జీలను చెల్లించాల్సి వచ్చిందని, ఇలాగైతే గ్లోబల్ బ్రాండ్ల సృష్టి ఎలా ఉంటుందని ప్రశ్నించారు. దేశంలోని 50 పర్యాటక ప్రాంతాలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోదాను కల్పించాలని, ఆతిథ్య రంగానికి ఇండస్ట్రీ హోదా కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
భారతీయ ఆతిథ్య రంగంలోకి 2028కల్లా 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రావచ్చని గ్లోబల్ కమర్షియల్ రియల్ ఎస్టేట్, ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ జేఎల్ఎల్ అంచనా వేస్తున్నది. శుక్రవారం విడుదల చేసిన ఓ నివేదికలో ఈ జనవరి-మార్చిలో రెవిన్యూ పర్ అవైలబుల్ రూమ్ నిరుడు ఇదే వ్యవధితో పోల్చితే 16.3 శాతం పెరిగిందని తెలిపింది. ఇక ఈ మూడు నెలల్లో 79 కొత్త హోటల్స్ అందుబాటులోకి వచ్చాయని, 9,478 గదులున్నాయని పేర్కొన్నది. బెంగళూరులో హోటల్స్కు డిమాండ్ బాగా ఉన్నదని వివరించింది.