Pulsar N 150 | ప్రముఖ ద్విచక్ర వాహనాల కంపెనీ బజాజ్ కంపెనీ తన లైనప్ నుంచి పల్సర్ N 150ని తొలగించాలని నిర్ణయించింది. ఈ బైక్ ఇప్పుడు కంపెనీ అధికారిక వెబ్సైట్లో కూడా కనిపించడం లేదు. దీన్ని బట్టి ఈ మోడల్‌ను తొలగించినట్లు స్పష్టంగా తెలుస్తున్నది. పల్సర్ N150 సెప్టెంబర్ 2023లో కంపెనీ లాంచ్ చేసింది. ఈ మోడల్‌ను ఇంత తక్కువ సమయంలో నిలిపివేయడాన్ని బట్టి అమ్మకాలు అంతబాగా లేవని సూచిస్తుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. సమాచారం మేరకు.. ఈ ఏడాది మేలో పల్సర్ క్లాసిక్, ఎన్ 150 బైక్స్ 15,937 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే సమయంలో 29,386 యూనిట్లు విక్రయమయ్యాయి. అలాంటి పరిస్థితిలో పేలవమైన అమ్మకాల నేపథ్యంలో కంపెనీ పల్సర్ ఎన్150ని అమ్మకాలను నిలిపివేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
రాబోయే రోజుల్లో కంపెనీ పల్సర్ 150 క్లాసిక్ అమ్మకాలను నిలిపివేయవచ్చనే ప్రచారం జరుగుతున్నది. కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే బజాజ్ పల్సర్ N150లో 149.68సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 14.3 బీహెచ్పీ పవర్, 13.5 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. దాంతో ఏ వాతావరణంలోనైనా ఇంజిన్ సమర్థవంతంగా పని చేస్తుంది. రైడర్ భద్రత కోసం, ఈ బైక్‌లో సింగిల్ ఛానల్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఇచ్చారు. ఫ్రంట్‌లో డిస్క్ బ్రేక్, రియర్‌లో భాగంలో డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. ఇది మాత్రమే కాకుండా బైక్‌లో 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ అందించారు. ఈ బైక్‌లో పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. మైలేజ్, స్పీడ్, బ్యాటరీ, ఇతర సమాచారాన్ని చూసుకోవచ్చు. బజాజ్ పల్సర్ N150 ప్రారంభ ధర రూ.1.38లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా.. త్వరలోనే కంపెనీ దీనికి అప్డేటెడ్ వెర్షన్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తున్నది.