కొద్ది ఏండ్ల క్రితం ప్రభుత్వ రంగ షేర్లు కేవలం డిజిన్వెస్ట్మెంట్ జరగవచ్చన్న వార్తలు వస్తేనే పెరిగేవి. వాటి నిర్వహణ ప్రభుత్వ నియంత్రణలో ఉన్నందున కేవలం డివిడెండ్లకే తప్ప, మూలధన లాభాలు వచ్చే అవకాశం లేదన్న నిరాశతో పీఎస్యూ షేర్ల కొనుగోళ్లకు మెజారిటీ ఇన్వెస్టర్లు దూరంగా ఉండేవారు. విదేశీ ఇన్వెస్టర్లయితే వాటిని దూరం పెట్టేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ రంగ షేర్లను మార్కెట్ చూసే విధానం మారింది. భారీ డివిడెండ్లే కాకుండా మూలధన రాబడుల్ని ఆర్జించే సత్తా వాటికి ఉందని గ్రహించారు. ఇన్వెస్టర్లు వాటిపై దృష్టిసారించగానే వాటిలో కదలిక వచ్చింది. ఈ విషయంలో తొలుత చెప్పుకోవాల్సింది రక్షణ రంగ పీఎస్యూలను. తదుపరి రైల్వే షేర్లు పెద్ద ఎత్తున ర్యాలీ చేసిన తర్వాత ఆయిల్ స్టాక్స్, ఇతర రంగాల్లోని పీఎస్యూ షేర్లు పరుగుల్ని ప్రారంభించాయి.
కారణాలివి..
పీఎస్యూల పట్ల ఇన్వెస్టర్ల దృక్కోణం మారడానికి ముఖ్యంగా మూడు కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది ప్రభుత్వ రంగ షేర్లు ఆయా కంపెనీల లాభాలతో పోలిస్తే కారుచౌక విలువలతో ట్రేడ్కావడం. దీంతో అదే రంగంలోని ప్రైవేటు రంగ కంపెనీ షేరు పీఈ (ప్రైస్ టూ ఎర్నింగ్స్) రేషియోకు అందుకునేదిశగా పిఎస్యూలను ఇన్వెస్టర్లు రీరేట్ చేయడం మొదలుపెట్టారు. ప్రభుత్వ రంగ కంపెనీలు కూడా వృద్ధిని సాధిస్తాయని, మూలధనాన్ని మెరుగ్గా ఉపయోగించుకుంటాయని విశ్వాసం ఇన్వెస్టర్లలో ఏర్పడటం మరో కారణం. కొన్ని పీఎస్యూలు కార్యకలాపాల్ని నిర్వహించే రంగాల్లో ప్రైవేటు రంగం చొచ్చుకుపోవడం కష్టసాధ్యం అని ఇన్వెస్టర్లు గ్రహించడం మూడో కారణం. ఆయిల్ రిఫైనింగ్, మార్కెటింగ్, కోల్ మైనింగ్, థర్మల్ పవర్ తదితర భారీగా మూలధనం అవసరమయ్యే రంగాల్లో పీఎస్యూలే ఆధిపత్యం చెలాయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2023లో ప్రభుత్వ రంగ షేర్లు భారీ ర్యాలీ జరిపాయి. వచ్చే 2024లో సైతం పరుగు కొనసాగుతుందని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.