పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఖాతాలను మైనర్ల కోసం కూడా తెరుచుకోవచ్చు. మారిన నిబంధనల ప్రకారం సదరు మైనర్లకు 18 ఏండ్లు నిండేదాకా ఈ ఖాతాలు పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ వడ్డీరేటుతో కొనసాగుతాయి. మైనార్టీ తీరిన తర్వాత పీపీఎఫ్ ఖాతాగా మార్చుకోవచ్చు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇక ఒకటికి మించి పీపీఎఫ్ ఖాతాలనూ తెరుచుకోవచ్చు. అలాగే ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీం (పీపీఎఫ్) 1968 కింద క్రియాశీల పీపీఎఫ్ ఖాతాలను తెరిస్తే ఫామ్ హెచ్ ద్వారా ఖాతాదారుని నివాస హోదా గురించి అడగకపోతే పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ మార్గదర్శకాల ప్రకారం ఈ నెలాఖరుదాకా ఉండే వడ్డీరేట్లు వర్తిస్తాయి. పీపీఎఫ్ అనేది కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాధనం. అంతేగాక మదుపరులను దీర్ఘకాలిక ఆకర్షణీయ ప్రయోజనాలతో కూడిన సేవింగ్స్, పెట్టుబడులకు ప్రోత్సహించే పథకం ఇది. దీనికి ఆదాయ పన్ను (ఐటీ) మినహాయింపులూ వర్తిస్తాయి.