EPFO Interest Rate | ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్) ఖాతాల్లో సొమ్ముపై ఇచ్చే వడ్డీరేటుపై కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకోనున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ ఖాతా నిల్వలపై వడ్డీ ఎనిమిది శాతానికి పరిమితం చేసే ప్రతిపాదనలు ముందుకు వస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై శనివారం జరిగే ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) – సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని విశ్వసనీయ సమాచారం. అలాగే మెరుగైన రిటర్న్స్ కోసం ప్రావిడెండ్ ఫండ్ నిల్వల్లో స్టాక్ మార్కె్ట్లలో పెట్టుబడులను 10 నుంచి 15 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకునేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు.
శనివారం జరిగే సీబీటీ సమావేశంలో పెన్షన్లు, బడ్జెట్ అంచనాలు తదితర అంశాలపై చర్చిస్తారని తెలుస్తు్న్నది. ఇప్పటికైతే ఈపీఎఫ్ నిల్వలపై వడ్డీరేటు ఏజెండాలో లేదు. కార్మికశాఖ, సీబీటీ చైర్మన్ అనుమతితో ఏజెండాలో చేర్చాలని భావిస్తున్నట్లు ఈపీఎఫ్ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో ఈపీఎఫ్ ఖాతా నిల్వలపై వడ్డీరేటును ఎనిమిది శాతం చెల్లించాలని ప్రతిపాదిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదానికి పంపుతారని ఆ వర్గాలు వెల్లడించాయి.
తాజా ప్రతిపాదనలు అమలులోకి వస్తే ఈపీఎఫ్‌పై 8శాతం వడ్డీరేటు 45 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోతుంది. 1977-78లో ఈపీఎఫ్ నిల్వలపై ఎనిమిది శాతం వడ్డీ ఇచ్చారు. అటుపై క్రమంగా ఈపీఎఫ్ నిల్వలపై పెరిగిన వడ్డీరేటు.. తర్వాతీ కాలంలో 11 ఏండ్లు 12శాతం వడ్డీ చెల్లించారు. తిరిగి మళ్లీ వడ్డీరేటు తగ్గిసున్నారు. 2022-23లో మాత్రం స్వల్పంగా వడ్డీరేటు పెంచారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 8.15 శాతం వడ్డీరేటు వర్తిస్తే, అంతకుముందు 2021-22లో 8.10 శాతమే ఇచ్చారు. సీబీటీ ప్రతిపాదనలను కేంద్రం ఆమోదిస్తే ఆర్థికశాఖ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అటుపై ఆరు కోట్ల మంది ఈపీఎఫ్ సబ్ స్క్రైబర్ల ఖాతాలో వడ్డీ మొత్తం డిపాజిట్ అవుతుంది.