Nitish Kumar | వచ్చే ఆర్థిక సంవత్సరా (2025-26) నికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్‌కు సమర్పించిన బడ్జెట్‌ను బీహార్ సీఎం నితీశ్ కుమార్ స్వాగతించారు. ప్రగతి శీల, భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన బడ్జెట్ అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వృద్ధిరేటు వేగవంతం అవుతుందన్నారు. ఏడాది లోపు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీహార్ భవిష్యత్ లక్ష్యాలను చేరుకునే దిశగా మఖానా బోర్డ్, గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలను ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారని గుర్తు చేశారు.
‘ఇది ఆచరణాత్మక, ముందు చూపుతో రూపుదిద్దుకున్న బడ్జెట్. ఇది రాష్ట్ర వృద్ధిరేటును మరింత వేగవంతం చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు నేను ధన్యవాదాలు తెలుపుతున్నా’ అని ఓ ప్రకటనలో నితీశ్ కుమార్ తెలిపారు. మఖానా బోర్డు ఏర్పాటుతో ఫాక్స్నట్ (Foxnut)పంట సాగు పురోభివృద్ధికి దోహద పడుతుందని, తద్వారా ప్రపంచ దేశాలకు గుర్తింపునిస్తుందన్నారు.
ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలతో బీహార్‌కు ఎయిర్ కనెక్టివిటీ లభిస్తుందని, తద్వారా మరిన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయని నితీశ్ కుమార్ చెప్పారు. ఐఐటీ పాట్నా కెపాసిటీ పెంపుతో బీహార్‌లో సాంకేతిక విద్యను బలోపేతం చేస్తుందని వ్యాఖ్యానించారు. ఆదాయం పన్ను శ్లాబ్‌ల సవరణతో మధ్య తరగతి ప్రజలకు ఉపశమనం లభిస్తుందన్నారు.