No Cost EMI | పండుగ సీజన్ వస్తోంది. వినాయక చవితి మొదలు దాదాపు రెండు నెలలపాటు వరుసగా పండుగలు రాబోతున్నాయి. దేశవ్యాప్తంగా ఓనమ్, నవరాత్రి, దసరా, దీపావళి ఇలా ఆగస్టు ఆఖరు నుంచి అక్టోబర్ వరకు కొద్ది రోజుల తేడాతో పండుగ వాతావరణమే ఉంటుందంతా. దీనికి తగ్గట్టుగానే మార్కెట్లో కూడా సందడి నెలకొంటుంది. ఇక ఆన్లైన్ మార్కెట్లో ఆఫర్లు సరేసరి. ముఖ్యంగా నో-కాస్ట్ ఈఎంఐలు (No Cost EMI) కస్టమర్లను ముంచెత్తుతూ ఉంటాయి. అయితే మనకు ఇవి లాభమా?.. నష్టమా!..
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో, మింత్రా ఇలా అనేక ఆన్లైన్ షాపింగ్ వేదికల్లో పండుగ సీజన్ వచ్చిందంటే చాలు ఎక్కడలేని ఆఫర్లు కనిపిస్తాయి. కస్టమర్లను టెంప్ట్ చేసేలా ఉంటాయవి. వీటిలో పలు ఈఎంఐ ఆఫర్లు, ప్రధానంగా నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు దర్శనమిస్తుంటాయి. ఎస్బీఐ, యాక్సిస్, ఐసీఐసీఐ, కొటక్ మహీంద్రా, ఫెడరల్, హెచ్డీఎఫ్సీ తదితర బ్యాంకులతోపాటు బజాజ్ ఫిన్సర్వ్ వంటి నాన్ బ్యాంకింగ్ సంస్థలూ వీటిని అందిస్తాయి. అయితే మీరు చేసే లావాదేవీకి సంబంధించి ఉన్న డాక్యుమెంట్లను పూర్తిగా చదివితే ఉత్తమం. ఉదాహరణకు మ్యూచువల్ ఫండ్ ప్రకటనల్ని చూస్తే.. ‘మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌లకు లోబడి ఉంటాయి. స్కీంకు సంబంధించిన అన్ని పత్రాలను జాగ్రత్తగా చదవండి’ అని ఉంటుంది.
దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు డాక్యుమెంట్లలో ఏముందనేది తెలుసుకోవడం ఎంత ముఖ్యమోనని. కనుక మనకు తెలియని కొన్ని చార్జీలు కూడా ఈ నో-కాస్ట్ ఈఎంఐలకు జత కలిసి ఉండొచ్చు. అన్నిసార్లూ ఇలాగే ఉంటుందనేది కాదు. కానీ ముందే పరిశీలించడం తెలివైన పని. మీరు కొనే వస్తువు ధరను మీరు ఎంచుకున్న నెలలతో భాగించండి. ఆ వచ్చేదే ఈఎంఐగా ఉంటే సమస్య లేదు. అంతకన్నా ఎక్కువగా ఉంటే ఏవేవో చార్జీలు పడ్డాయన్నమాటే. ఆయా బ్యాంకులనుబట్టి ఇవి రూ.199 నుంచి రూ.299దాకా ఉంటాయి. అలాగే ప్రాసెసింగ్ ఫీజులుంటాయి. వీటిపై జీఎస్టీ సైతం పడుతుంది. ఇక ఒక్క ఈఎంఐ చెల్లించకపోయినా.. ఆలస్య రుసుములు, జరిమానాలు, వడ్డీలు విధిస్తారు. పైగా క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది.
ఈఎంఐల్లో కాకుండా ఒకేసారి నగదు చెల్లించి కొనే వీలుంటే.. ఒక వస్తువుపై ఆన్లైన్లో కనిపించే ధరకన్నా మన దగ్గర్లోని దుకాణాలు లేదా ఆయా స్టోర్లలోనే దాని రేటు తక్కువగా ఉంటుంది. అందుకే ఏదైనా వస్తువును ఆన్లైన్లో షాపింగ్ చేయాలనుకుంటే మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి? అన్నది చూసుకోవాలి. దుకాణదారులతో బేరమాడితే ఇంకా తక్కువకు వచ్చే వీలున్నది. పైగా ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర అనవసరపు చెల్లింపులకు తావులేకుండా డీల్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ పండుగ సీజన్ షాపింగ్‌ను పక్కాగా ప్లాన్ చేసుకోండి. బయట మార్కెట్లో, ఆన్లైన్లో ఏయే ధరలున్నాయి అన్నది చూసుకోండి. బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై లభించే ఆఫర్లనూ గమనించి ముందుకెళ్తే మరింత లాభదాయకం.