న్యూఢిల్లీ, ఆగస్టు 31: గత కొన్ని నెలలుగా నిరాశాజనక పనితీరు కనబరిచిన కీలక రంగాలు ఎట్టకేలకు కోలుకున్నాయి. బొగ్గు, క్రూడాయిల్, సహజ వాయువు విభాగాలు అంచనాలకుమించి రాణించడంతో జూలై నెలకుగాను 8 శాతం వృద్ధి నమోదైంది. క్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 4.8 శాతంతో పోలిస్తే భారీగా పెరగగా..కానీ, జూన్ నెలలో నమోదైన 8.3 శాతంతో పోలిస్తే మాత్రం తగ్గింది.
స్టీల్, సిమెంట్, విద్యుత్ రంగాల్లో ఉత్పత్తి కూడా పెరిగినట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలలు(ఏప్రిల్ నుంచి జూలై) కీలక రంగాల్లో నిస్తేజం ఆవహరించింది. ఏడాది క్రితం 11.5 శాతంగా ఉన్న వృద్ధి ఈసారి సగానికి సగం 6.4 శాతానికి పడిపోయింది.