న్యూఢిల్లీ, జూలై 10: హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్(హెచ్‌యూఎల్)కు తొలిసారి మహిళ నాయకత్వం వహించబోతున్నారు. ప్రస్తుతం కంపెనీ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రియా నాయర్‌ను చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి, మేనేజింగ్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. ఈ నియామకం ఆగస్టు 1 నుంచి అమలులోకి రానున్నది. ఐదేండ్లపాటు ఆమె ఈ పదవిలో కొనసాగనున్నారు. కంపెనీ సీఈవో, ఎండీ పదవికి రోహిత్ జావా రాజీనామా చేయడంతో ఈ స్థానంలో ప్రియా నాయర్ ఎంపికయ్యారు.
హెచ్‌యూఎల్, యూనిలీవర్లలో ప్రియా అద్భుతమైన కెరీర్ కలిగివున్నది..భారత మార్కెట్‌పై ఆమెకున్న లోతైన అవగాహన, అద్బుతమైన ట్రాక్ రికార్డుతో సంస్థను తదుపరి స్థాయికి తీసుకెళ్లనున్నదని ఆశిస్తున్నట్టు హెచ్‌యూఎల్ చైర్మన్ నితిన్ పరంజపీ తెలిపారు. 1995లో హెచ్‌యూఎల్‌లో చేరిన ఆమె..సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగాల్లో విధులు నిర్వహించారు. ఆమె సారథ్యంలో హోమ్‌కేర్ విభాగం 2014 -2020లో భారీ వృద్ధిని నమోదు చేసుకున్నది.