Premzi Share in Sagar Cement | రూ.350 కోట్లతో 10 శాతం వాటా కొనుగోలు
హైదరాబాద్, మార్చి 25: రాష్ర్టానికి చెందిన ప్రముఖ సిమెంట్ తయారీ సంస్థ సాగర్ సిమెంట్‌లో 10.10 శాతం వాటాను కొనుగోలు చేసింది ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ సంస్థ. ఇందుకోసం రూ.350 కోట్ల నిధులను వెచ్చింది. ప్రముఖ టెక్నాలజీ దిగ్గజమైన విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీకి చెందినదే ప్రేమ్‌జీ ఇన్వెస్ట్. పలు సంస్థల్లో పెట్టుబడులు పెట్టే ఉద్దేశంలో భాగంగా అజీం ప్రేమ్‌జీ ఈ సంస్థను నెలకొల్పారు. దీంతో సాగర్ సిమెంట్‌లో ప్రమోటర్ల వాటా 50.28 శాతం నుంచి 45.2 శాతానికి తగ్గనున్నది. మిగతా వాటాను ఇతర పెట్టుబడిదారుల నుంచి కొనుగోలు చేసింది ప్రేమ్‌జీ ఇన్వెస్ట్. ఈ వాటా విక్రయ విషయాన్ని సాగర్ సిమెంట్ బీఎస్ఈకి సమాచారం అందించింది. ఈ సందర్భంగా కంపెనీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ..ప్రేమ్‌జీ పెట్టుబడులను వ్యాపార విస్తరణకు వినియోగించనున్నట్లు చెప్పారు.
ప్రతియేటా సాగర్ సిమెంట్ 82 లక్షల టన్నుల సిమెంట్‌ను ఉత్పత్తి చేస్తున్నది. దేశీయ సిమెంట్ ఉత్పత్తి సంస్థల్లో ఇదే తక్కువది. సంస్థకు తెలంగాణతోపాటు ఏపీ, మధ్యప్రదేశ్, ఒడిశాల్లో ఉత్పత్తి ప్లాంట్లు ఉన్నాయి. మరోవైపు, ఈ వాటా విక్రయానికి సంబంధించి శుక్రవారం సమావేశమైన కంపెనీ బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. రూ.2 ముఖ విలువ కలిగిన రూ.265 విలువైన 1.32 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ కొనుగోలు చేసింది. 40 ఏండ్లకు పైగా సేవలు అందిస్తున్న సాగర్ సిమెంట్..తెలంగాణతోపాటు ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాలకు విస్తరించింది. త్వరలో తన వ్యాపారాన్ని మధ్య భారతంతోపాటు తూర్పు భారతానికి విస్తరించే యోచనలో ఉన్నది.