న్యూఢిల్లీ, జూన్ 4: దేశీయ పౌల్టీ రంగానికి దాణా ఖర్చుల సెగ గట్టిగానే తాకింది. ఈ దెబ్బకు పౌల్ట్రీ సంస్థలు ఉత్పత్తిని 25 శాతం వరకు తగ్గించుకునే యోచనలో ఉన్నాయని ఆల్ ఇండియా పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్(ఏఐపీబీఏ) తాజాగా వెల్లడించింది. వీటికి తోడు జూలై నుంచి అక్టోబర్ మధ్యకాలంలో పండుగ సీజన్ కావడంతో చికెన్‌కు డిమాండ్ పడిపోనుండటం కూడా ఉత్పత్తి కోత పెట్టడానికి ప్రధాన కారణాలని ఏఐపీబీఏ చైర్మన్ బహదూర్ అలీ తెలిపారు.
అలాగే సోయాబీన్ మీల్ ధరలు గడిచిన కొన్ని నెలల్లో 40 శాతం వరకు పెరుగడంతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న పౌల్ట్రీపై దాణా పిడుగు పడినట్టు అయిందన్నారు. ఉత్పత్తి వ్యయం పెరిగి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పౌల్ట్రీ సంస్థలపై జూలై నుంచి అక్టోబర్ వరకు నవరాత్రి, శ్రావణ, కార్తిక మాసం ఉండటంతో కొనుగోళ్లు పడిపోనున్నాయన్నారు.