హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): దక్షిణాసియాలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఈవెంట్‌ను ఈనెల 25 నుంచి 28 వరకు మూడు రోజులపాటు హైదరాబాద్ హైటెక్స్‌లో నిర్వహించనున్నట్టు ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్(ఐపీఈఎంఏ) తెలిపింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్‌సింగ్ బయాస్ మాట్లాడుతూ…వికసిత్ భారత్ దిశగా, స్థిరమైన పౌల్ట్రీ భవిష్యత్తు కోసం 17వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పోను వన్ నేషన్ వన్ ఎక్స్పో అనే థీమ్‌తో నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఈ ఎక్స్‌పోలో 1,500కి పైగా ప్రతినిధులు, వివిధ దేశాలకు చెందిన అంతర్జాతీయ నిపుణులు పాల్గొంటారని చెప్పారు. ప్రస్తుతం భారతదేశం గుడ్ల ఉత్పత్తిలో రెండవ స్థానం, బ్రాయిలర్ మాంసం ఉత్పత్తిలో నాలుగో స్థానంలో ఉందని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు రూ.1.35 లక్షల కోట్లకు పైగా తోడ్పడుతూ.. పోషకాహారం, గ్రామీణాభివృద్ధి, ఉద్యోగావకాశాల పెరుగుదలకు పౌల్ట్రీ పరిశ్రమ కీలకంగా మారిందని వెల్లడించారు. ఈ సమావేశంలో తెలంగాణ పౌల్ట్రీ ఫార్మర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, కార్యదర్శి భాస్కర్‌రావు, ప్రతినిధులు నర్సింహారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, నెక్ అడ్వైజర్ బాలరాజ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఏపీలకు చెందిన పౌల్ట్రీ ఫార్మర్స్ అసోసియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.