Potato | హిమాచల్ ప్రదేశ్లోని ఉనా జిల్లాలో బంగాళా దుంప (ఆలుగడ్డ)ల దిగుబడి 30 శాతం తగ్గిపోయింది. వేసవిలో తీవ్రమైన వేడి, శీతాకాలం ఆలస్యం కావడంతో బంగాళా దుంపల దిగుబడి తగ్గుముఖం పట్టిందని రైతులు చెబుతున్నారు.ఫలితంగా రిటైల్ మార్కెట్లో బంగాళా దుంపల ధరలు పెరిగే అవకాశం ఉందంటున్నారు.
గోధుమలు, మొక్కజొన్న, బంగాళా దుంప పంటల సాగుతో రైతులు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు. ఉనా జిల్లాలో గోధుమలు, మొక్కజొన్నల తర్వాత రైతులు అత్యధికంగా పండిస్తున్న పంట బంగాళా దుంపలు. 1200 హెక్టార్ల పరిధిలో రైతులు బంగాళా దుంపల పంట సాగు చేస్తున్నారు. ఏటా సుమారు 20 వేల నుంచి 25 వేల టన్నుల దిగుబడి వస్తోంది. క్వింటాల్ బంగాళా దుంపల ధర సాధారణంగా రూ.3,000-3,600 మధ్య పలికితే రైతులకు గిట్టుబాటు అవుతుంది.
సెప్టెంబర్ నెల మొదటి వారంలో అధిక ఉష్ణోగ్రత వల్ల దిగుబడి తగ్గుముఖం పట్టింది. కనాల్ పరిధిలో సాధారణంగా ఏడెనిమిది క్వింటాళ్ల బంగాళా దుంపలు దిగుబడి వస్తుండగా, తాజా పరిస్థితులతో ఎకరాకు ఒకటి లేదా రెండు క్వింటాళ్ల దిగుబడి తగ్గుతుంది. వాతావరణంలో మార్పులతో పంట దిగుబడిపై ప్రభావం పడింది. వేసవిలో అతి తీవ్రత, అకాల వర్షాలు కూడా పంటపై ప్రతికూల ప్రభావం చూపాయి.
ఉనా జిల్లాలో 35 వేల హెక్టార్ల భూమి పరిధిలో గోధుమల సాగు చేస్తారు. నవంబర్ నెల ప్రారంభం నుంచి గోధుమ విత్తనాలు విత్తుతారు. కానీ, 45 రోజులుగా భూమిలో తేమశాతం తక్కువగా ఉండటంతో గోధుమ విత్తనాలు విత్తడానికి రైతులు వెనుకంజ వేస్తున్నారు. ఇక జిల్లాలోని మరో 28 వేల హెక్టార్ల భూమికి సాగునీటి వసతులు లేవు. సకాలంలో వర్షాలు కురిస్తే తప్ప పంటల సాగు ఉండదు.