న్యూఢిల్లీ, జనవరి 30: లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ పోర్షే…దేశీయంగా తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. భారత్‌లో కంపెనీకి చెందిన కార్లకు డిమాండ్ అధికంగా ఉండటంతో ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో(జూన్ నాటికి) హైదరాబాద్‌తోపాటు పుణెల్లో కొత్తగా రిటైల్ అవుట్‌లెట్‌ను ప్రారంభించబోతున్నట్లు పోర్షే ఇండియా బ్రాండ్ డైరెక్టర్ మనోలిటో వ్యూజిసిస్ తెలిపారు.
2023లో సంస్థ దేశీయంగా 914 యూనిట్ల వాహనాలను విక్రయించింది. అంతక్రితం ఏడాదిలో అమ్ముడైన వాహనాల కంటే 17 శాతం అధికమని ఆయన పేర్కొన్నారు. వీటిలో 65 ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఉన్నాయన్నారు. గతేడాదిలో సంస్థ రికార్డు స్థాయి వాహనాలను విక్రయించినట్లు, అత్యంత విలాసవంతమైన వాహనాలను కోరుకుంటున్నవారు రోజురోజుకు పెరుగుతుండటంతో ఇక్కడ విక్రయాల్లో రెండంకెల వృద్ధిని సాధించినట్లు చెప్పారు. ఇదే క్రమంలో 2024లోనూ పలు నూతన వాహనాలను ఇక్కడి మార్కెట్‌కు పరిచయం చేయనున్నట్లు ప్రకటించారు.