హైదరాబాద్, సెప్టెంబర్ 10: ప్లాస్టిక్ వ్యర్థాలను పునర్వినియోగంలోకి తేవడానికి రీ సస్టెయినబిలిటీ..ఇన్వెస్ట్మెంట్ సంస్థ షార్ప్ వెంచర్స్‌తో జట్టుకట్టింది. దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ వ్యర్థాలు అధికమవుతుండటంతో ప్రతియేటా వాతావరణ కాలుష్యం జరుగుతున్నదని, దీనిని తగ్గించడానికి తొలి విడుతలో హైదరాబాద్‌తోపాటు ఛత్తీస్‌గడ్‌లలో రూ.50 కోట్ల పెట్టుబడితో రీసైక్లింగ్ ప్లాంట్లను నెలకొల్పినట్లు రీ సస్టెయినబిలిటీ లిమిటెడ్ ఎండీ, సీఈవో మసూద్ మాలిక్ తెలిపారు.
హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన యూనిట్ సామర్థ్యం 24 వేల టన్నులు కాగా, రాయ్‌పూర్‌లో 8 వేల టన్నులు కలుపుకొని మొత్తంగా ప్రతియేటా 32 వేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పునర్వినియోగంలోకి రానున్నట్లు చెప్పారు. దీంతో ప్రతియేటా 15 వేల టన్నుల కార్బన్డయాక్సైడ్ తగ్గనున్నదన్నారు. వచ్చే రెండేండ్లలో ఈ కెపాసిటీని 10 లక్షల టన్నులకు పెంచడానికి మూడు నుంచి ఐదు యూనిట్లను నెలకొల్పబోతున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం రూ.100 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు సూచనప్రాయంగా చెప్పారు. ఈ ప్లాంట్లు ఏర్పాటు చేయడంతో 370 మందికి ప్రత్యక్షంగా, 2 వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని, వీరిలో 75 శాతం మంది మహిళలు కావడం విశేషమన్నారు.