Insurance | ఆర్థిక మాంద్యం ముంచుకొస్తుందన్న హెచ్చరికలు.. పొదుపు మంత్రం పాటిస్తున్న కార్పొరేట్ కంపెనీలు.. ఏ క్షణంలోనైనా లే-ఆఫ్‌లు ప్రకటించే అవకాశం. ఇటీవలి కాలంలో లే-ఆఫ్‌లు తరుచుగా జరుగడం ఆందోళనకరం. ట్విట్టర్, మెటా తర్వాత ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్ 18 వేల మందిని ఇంటికి సాగనంపాలని నిర్ణయించింది. స్టార్టప్ సంస్థలు సైతం ఉద్యోగుల్ని వదిలించుకుంటున్నాయి. ఈ అకస్మిక లే-ఆఫ్‌లు ఉద్యోగుల మానసిక పరిస్థితిని దెబ్బ తీస్తాయి. నెలవారీగా వచ్చే ఆదాయం అర్ధంతరంగా నిలిచిపోతే సమస్యలు చుట్టుముడతాయి. ఇంటి రుణం లేదా ఆటోమొబైల్ రుణం తీసుకున్నట్లయితే వాటి చెల్లింపులు కష్టతరంగా మారుతుంది.
తరుచుగా లే-ఆఫ్‌లు మీడియాలో పతాక శీర్షికలకెక్కుతున్న వేళ.. ఉద్యోగం కోల్పోతే కవరేజీ కోసం ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేయడానికి పరుగులు తీస్తుంటారు. ఆతృత పడుతుంటారు. ఒకవేళ ఉద్యోగం కోల్పోతే ఆర్థిక సమస్యలు తలెత్తకుండా బీమా పాలసీ ఆశాకిరణంగా, రక్షణ కవచంగా ఉంటుందని భావిస్తున్నారు. ఉద్యోగాలు కోల్పోతే కవరేజీ కోసం తీసుకునే బీమా పాలసీల్లో స్పెసిఫిక్ ఇన్సూరెన్స్ ప్లాన్లు ఉన్నాయి. కానీ ఇది మెరుగైన విధానం కాదు.
ఉద్యోగం కోల్పోయిన వారు కవరేజీ కోసం తీసుకునే బీమా పాలసీ వర్కవుట్ కాదు. అత్యధిక పాలసీలు అసంకల్పితంగా ఉద్యోగాలు కోల్పోయిన వారికే కవరేజీ కల్పిస్తాయి. ఒక ఉద్యోగి తాను స్వచ్ఛందంగా గానీ, సంకల్పితంతో గానీ ఉద్యోగం పోగొట్టుకోలేదని రుజువు చేసుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఉద్యోగులను కంపెనీ యాజమాన్యాలు రాజీనామా చేయాలని కోరతాయి.
సుదీర్ఘకాలం నిరుద్యోగం కొనసాగినప్పుడు ఈ పాలసీలను రెన్యువల్ చేయకపోవడం అన్యాయం. మెడికల్ ఇన్సూరెన్స్ ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఉద్వాసనకు గురైన ఉద్యోగుల ఇండ్లపై ఆదాయం పన్ను శాఖ అధికారులు దాడులు చేసే అవకాశాలు ఉన్నాయి. ఉద్వాసనకు గురైన ఉద్యోగులకు యాజమాన్యాలు ఇచ్చే సీవరెన్స్ ప్యాకేజీలకు ఆదాయం పన్ను వర్తిస్తుంది. కానీ, కొన్ని పరిస్థితుల్లో తాము పొందిన ప్యాకేజీకి పన్ను మినహాయింపు లభిస్తుందని ఉద్వాసనకు గురైన ఉద్యోగులు క్లయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు లీవ్ ట్రావెల్ అలవెన్స్ పై మాదిరిగా సీవరేజ్ ప్యాకేజీపై పన్ను మినహాయింపు ఉంది.
ఉద్యోగ అభద్రత వేళ వర్కింగ్ ఎగ్జిక్యూటివ్‌లు తమ ఉద్వాసనల ప్రభావంతో నష్టాలు, ఇబ్బందులు తలెత్తకుండా పర్సనల్ ఫైనాన్స్ అభివృద్ధి చేసుకోవడంపైనే దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. రుణ చెల్లింపు అత్యంత కష్టతరమైన అంశం. ఉద్యోగం చేస్తున్నప్పుడే రుణ పునః చెల్లింపు వ్యహాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. రుణ రీపేమెంట్స్ కోసం కంటింజెన్సీ ఫండ్ సిద్ధం చేసుకోవడం ఉత్తమం. మంచి స్థితిలో ఉన్నప్పుడే కంటింజెన్సీ ఫండ్ సిద్ధం చేసుకుంటే కష్టకాలంలో అది అండగా నిలుస్తుంది.