Money Saving Tips | రోజురోజుకు ధరలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా ద్రవ్యోల్బణం పైపైకి దూసుకెళ్తున్నది. దాన్ని అదుపు చేయడానికి ఆర్బీఐ రెపోరేట్ పెంచుతుంది. ఆర్బీఐ రెపోరేట్‌కు అనుగుణంగా బ్యాంకులు కూడా వడ్డీరేట్లు పెంచేస్తుంటాయి. ముఖ్యంగా ఇండ్ల రుణాలు మొదలు పర్సనల్ లోన్లు, బిజినెస్ లోన్లు, ఆటోమొబైల్ లోన్లపై వడ్డీ రేట్ల పెంపుతో రుణాలన్నీ భారంగా మారుతున్నాయి. ఇండ్ల రుణాల వాయిదా చెల్లింపు గడువు ఏండ్లకేండ్లు పెరిగిపోతున్నది. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తమ సంపాదన ఖర్చు చేసే విషయమై ఆచితూచీ ముందుకెళ్లాల్సి ఉంటుంది. వృధా ఖర్చులకు కళ్లెం వేయాలి.. అలా అనవసర ఖర్చులు నిలిపేయకపోతే భవిష్యత్ జీవిత లక్ష్యాలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అనవసర ఖర్చులను అదుపు చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో ఓ లుక్కేద్దాం..
ప్రతి నెల మొదట్లో ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో నగదు నిల్వలు ఆకర్షణీయంగా ఉంటాయి. ఖర్చు చేయడానికి పెద్దగా ఆలోచించరు.. ఆ అవసరం కూడా కనిపించదు.. కానీ నెలాఖరు నాటికి చాలా మంది ఆందోళనకర పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటారు. ప్రతి రూపాయి ఖర్చు చేయడానికి వెనకాముందూ ఆలోచించుకోవాల్సి వస్తుంది. సందర్భానుసారంగా ప్రతి ఒక్కరూ కొన్ని ఖర్చులు చేయాల్సి రావచ్చు. కానీ ప్రతి అవసరానికి ఖర్చు చేసే ధోరణికి స్వస్తి పలుకాల్సిందే. వృధా ఖర్చులు అప్పటికప్పుడు తాత్కాలికంగా ఆనందాన్ని కలిగించినా.. ఆ ఖర్చు నివారిస్తే భవిష్యత్ అవసరాలకు భరోసా కల్పించే పరిస్థితి కనిపించొచ్చు. కనుక వృధా ఖర్చులేమేం ఉన్నాయో కనిపెట్టగలిగితే ఖర్చులపై నియంత్రణ సులువవుతుంది. వ్యయం తగ్గి పొదుపు పెరుగుతుంది.
పలు సందర్భాల్లో మన సంపాదన ఖర్చు చేయడం భావోద్వేగాలు, ఏమోషన్లతో ముడి పడి ఉంటుంది. మన రోజువారీ జీవన శైలి కోసం ఎక్కువ ఖర్చు చేయడం సాధారణం అనిపించినా.. మన స్థాయిని మించి ఖర్చు పెట్టడం కూడా సరి కాదు.. కొత్త వస్తువు కొనాలనిపించవచ్చు. భోజనం తప్పనిసరి.. బట్టలు జీవితంలో భాగమే కానీ.. అతిగా ఖర్చు చేయకుండా నియంత్రణ సాధించాలి.. అధిక ఖర్చులు సాధ్యమైనంత వరకు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి
ప్రతి ఒక్కరూ తమ ఆదాయం ఖర్చు చేసే విషయంలో ప్లాన్ రూపొందించుకోవాలి. ఆదాయంతోపాటు ఖర్చులకు ఒక బడ్జెట్ తయారు చేసుకోవాలి. ఆదాయంలో 20 శాతం పొదుపు, 50 శాతం వరకు నెలవారీ అవసరాలకు కేటాయించాలి.. 40 శాతానికి పైగా రుణ వాయిదా పేమెంట్స్ లేకుండా చెక్ చేసుకోవాలి.. ఒక్కమాటలో చెప్పాలంటే కేవలం రోజువారీ ఖర్చుల కోసమే ఒక బ్యాంకు ఖాతా నిర్వహిస్తూ ఉండాలి.. దీనివల్ల మన రోజువారీ ఖర్చులపై ఖచ్చితమైన లెక్క దొరుకుతుంది. టూర్లకు వెళ్లినా, ఏ వస్తువు కొనుగోలు చేసినా ఆదాయానికి లోబడిన ఖర్చు చేయడానికి ప్రయత్నించాలి.. ఆదాయానికి లోబడిన బడ్జెట్లో ఖర్చులు ఉంటేనే భవిష్యత్‌లో ఇబ్బందులు ఉండవు. అలా కానీ పక్షంలో ఫ్యూచర్లో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.
ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరూ క్రెడిట్ కార్డు వాడుతున్నారు. క్రెడిట్ కార్డు ఉన్నందున దాని వాడకం సులభంగా, సౌకర్యవంతంగానే ఉంటుంది కానీ దాని వాడకంలోనే తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలి. పరిమితి ఉందని చెప్పి.. అంత వరకు ఖర్చులు చేస్తే.. తర్వాతీ నెలలో క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించాల్సి వచ్చినప్పుడు చుక్కలు కనిపిస్తాయి. అటువంటప్పుడు క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించడం కష్టతరంగా మారుతుంది.
తమ నెలవారీ ఖర్చులపై సరైన అవగాహన లేకుండానే పలువురు ఖర్చు చేస్తుంటారు. అవసరం వచ్చిందని క్రెడిట్ కార్డు వాడేసి.. తర్వాత బిల్లు చెల్లించలేక ఇబ్బందుల పాలవుతుంటారు. క్రెడిట్ కార్డు వాడకంలో ఆర్థికపరమైన వెసులుబాటు ఉన్నా.. అదుపాజ్ఞల్లేని ఖర్చులతో చిక్కులు కొని తెచ్చుకోవడమే కనుక మీరు, మీ క్రెడిట్ కార్డు పరిమితిలో 30-40 శాతానికి మించి వాడకుండా ఉండటమే బెటర్ అని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు.
కుటుంబం అన్న తర్వాత కొన్ని ఖర్చులు వస్తుంటాయి. వాటిల్లో వాయిదా వేయతగినవి ఉంటాయి. అలా వాయిదా వేయడం వల్ల తలెత్తే ఇబ్బందులేమీ ఉండవు.. ఇంటి అవసరాలకు ఏదైనా వస్తువు కొనుగోలు చేయాల్సి రావచ్చు.. వాటిల్లో తర్వాత కొనుగోలు చేసే అవకాశం ఉంటే.. వాయిదా వేయొచ్చు. దీంతో మీ రోజువారీ ఖర్చుల్లో అధిక వ్యయం తగ్గించుకునేందుకు వీలు కలుగుతుంది.. ఇప్పుడు పలు సంస్థలు తమ ఉత్పత్తులపై వాయిదా పద్దతి పేమెంట్స్ కల్పిస్తున్నాయి. అలా అవకాశం లభించిందని ప్రతి వస్తువు కొనుగోలుకు ప్రాధాన్యం ఇవ్వవద్దు. దీనికి బదులు అలా చెల్లించే వాయిదా పేమెంట్స్‌ను రికరింగ్ డిపాజిట్లు చేసుకుని మొత్తం సొమ్ము జమ చేసుకున్నాక కొనుగోలుచేస్తే వెసులుబాటుగానూ ఉంటుంది.
ప్రతి ఒక్కరూ తమ పెట్టుబడులకు ఆటో డెబిట్ ఆప్షన్ వాడుతుండటం బెటర్. దీనికోసం మరో ప్రత్యేకమైన బ్యాంకు ఖాతా ఉండేలా చూసుకోవాలి. అలా చేయడం వల్ల ప్రతి నెలా మీ ఖాతాలో వేతనం డిపాజిట కాగానే పెట్టుబడులకు సంబంధించి ఆటో డెబిట్ ఆప్షన్ వినియోగించడం వల్ల ఆ మొత్తం ఒకటి, రెండు రోజుల్లోనే ఆయా పెట్టుబడి పథకాల్లో డిపాజిట్ అవుతాయి. ఈ పెట్టుబడుల కోసం ఏర్పాటు చేసుకున్న ఖాతాను యూపీఐ యాప్‌లతో లింక్ చేయొద్దు. అలా చేయడం వల్ల పెట్టుబడి మొత్తాలు ఖర్చు చేయకుండా నివారించవచ్చు.