Tesla Car | అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ టెస్లా కోసం భారత ప్రభుత్వం ప్రత్యేకంగా పాలసీలను రూపొందించబోదని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులందరినీ ఆకర్షించేలా దేశంలో చట్టాలు, టారిఫ్ నిబంధనలను రూపొందిస్తామని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. బ్యాటరీతో నడిచే వాహనాలను ఎక్కువగా వినియోగించడం ద్వారా కార్బన ఉద్గారాలతో పాటు ముడి చమురు ధర బిల్లు తగ్గుతుందన్నారు. బలమైన ఈవీ ఎకోసిస్టమ్ అవసరాన్ని మోదీ ప్రభుత్వం అర్థం చేసుకుందని పేర్కొన్నారు.
ఇందుకు ప్రభుత్వం ఏ ఒక్క కంపెనీకి ఉపయోగపడేలా పాలసీలను తయారుచేయదన్నారు. ప్రపంచంలోని ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులందరు భారత్కు వచ్చేలా ప్రోత్సహించేలా పాలసీలను రూపొందిస్తామన్నారు. ప్రస్తుతం అనేక కార్యక్రమాలపై కసరత్తు జరుగుతుందన్న ఆయన.. వాటాదారులతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. యూరప్, అమెరికా, జపాన్, దక్షిణ కొరియా సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులతో చర్చలు జరుగుతున్నాయని వివరించారు. వాస్తవానికి దేశీయంగా వాహనాల తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో భారత్ మోటారు వాహనాల దిగుమతిపై అధికంగా సుంకాలను విధిస్తున్నది.
ఇది విదేశీ కార్ల తయారీ కంపెనీలకు పెద్ద సమస్యగా మారింది. టెస్లా సైతం భారత్కి వచ్చేందుకు రాయితీ కోరుతున్నది. అయితే, 40వేల అమెరికన్ డాలర్ల కంటే తక్కువ ఉన్న కార్లపై 70శాతం కస్టమ్స్ సుంకం ఉండగా.. 40వేల డాలర్ల కంటే ఎక్కువ ధర ఉన్న కార్లపై వందశాతం కస్టమ్స్ సుంకం అమలువుతున్నది. ఈ క్రమంలో టెస్లా భారత్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సుంకాన్ని 70శాతానికి తగ్గించాలని కోరుతున్నది. అయితే, ఏ ఒక్క కంపెనీ కోసం.. దాని ప్రయోజనాల కోసం ప్రత్యేకంగా పాలసీలను రూపొందించలేమని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికీ తమ డిమాండ్లను చెప్పుకునే స్వేచ్ఛ ఉందన్న ఆయన.. డిమాండ్ల ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని దీని అర్థం కాదన్నారు.