హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ) : అమెరికాలోని డెట్రాయిట్ కేంద్రంగా ఐటీ కార్యకలాపాలు అందిస్తున్న ‘ పై స్కేర్ టెక్నాలజీస్’ హైదరాబాద్లో గ్లోబల్ సెంటర్ను ఏర్పాటు చేసింది. ఈ నూతన కార్యాలయాన్ని ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..గ్లోబల్ డెలివరీ సెంటర్లకు కేంద్రంగా హైదరాబాద్ మారుతున్నదని, ఐటీ రంగాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్లనే ఇది సాధ్యమైందన్నారు.
పై స్కేర్ గ్రూపు ప్రెసిడెంట్ శరత్ కొత్తపల్లి మాట్లాడుతూ.. ప్రసుత్తం సంస్థలో 300 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, మరో రెండేండ్లలోనే ఈ సంఖ్యను 1000కి పెంచుకోనున్నట్లు ఆయన ప్రకటించారు. అంతర్జాతీయ క్లయింట్లకు ఇక్కడి నుంచి సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ నూతన గ్లోబల్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు కంపెనీ సీఈవో శ్రీనివాస్ రాజు తెలిపారు. డాటా సైన్స్, ఏఐ, ఐవోటీ, సైబర్ సెక్యూరిటీ, యానిమేషన్, వీఎఫ్ఎక్స్, సీజీఐ, ఆర్, వీఆర్లపై మరింత దృష్టి సారించడానికి ఈ సెంటర్ దోహదం చేయనున్నదన్నారు.