లీడింగ్ డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్ ‘ఫోన్‌పే (PhonePe)’.. ఇప్పటి వరకు యూపీఐ లావాదేవీలకు పరిమితమైంది. తాజాగా తన ఫైనాన్సియల్ సర్వీసెస్ విస్తరించాలని నిర్ణయించింది. అందుకోసం స్టాక్ బ్రోకింగ్ బిజినెస్‌లోకి ఎంటరవుతున్నట్లు తెలిపింది. ఇందుకోసం ‘షేర్ (డాట్) మార్కెట్ (Share.Market)’ యాప్ ఆవిష్కరించినట్లు ఫోన్‌పే కో ఫౌండర్ కం సీఈఓ సమీర్ నిగమ్ తెలిపారు.
రిటైల్ ఇన్వెస్టర్లు స్టాక్స్ కొనుగోలు చేయడంతోపాటు ఇంట్రాడే ట్రేడింగ్‌లో పాల్గొనడానికి, మ్యూచువల్ ఫండ్స్ కొనుగోళ్లు చేయడానికి వీలుగా మొబైల్ యాప్, వెబ్ ప్లాట్‌ఫామ్ అందుబాటులోకి తెచ్చింది. వీటితోపాటు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) కొనుగోళ్లలో ఇన్వెస్టర్లకు చేయూతనిస్తుంది. ఫోన్‌పే (డాట్) మార్కెట్) యాప్ ద్వారా స్టాక్స్ కొనుగోలు చేసే రిటైల్ ఇన్వెస్టర్లకు డిస్కౌంట్ బ్రోకింగ్ ఆఫర్ చేస్తున్నది.
యూపీఐ సేవలతోపాటు ఇప్పటికే బీమా పాలసీలను అందిస్తున్నది ఫోన్‌పే. నాలుగేండ్ల క్రితమే మ్యూచువల్ ఫండ్స్ రంగంలోకి ఎంటరయ్యామని, రుణాలు, ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్స్ ఇటీవలే ప్రారంభించామని సమీర్ నిగమ్ తెలిపారు.