న్యూఢిల్లీ, జూన్ 23 : దేశీయ అతిపెద్ద ఫిన్‌టెక్ సంస్థ, డిజిటల్ పేమెంట్స్ యాప్ ఫోన్‌పే.. తమ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు వడివడిగా సిద్ధమవుతున్నది. రూ.13వేల కోట్ల నిధుల సమీకరణే లక్ష్యంగా ఐపీవోకు రాబోతున్నట్టు సమాచారం. ఆగస్టులో క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీకి డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌ను సమర్పించే వీలుందంటున్నారు. ఈ క్రమంలోనే పబ్లిక్ ఇష్యూ కోసం బ్యాంకర్లుగా కొటక్ మహీంద్రా క్యాపిటల్, జేపీమోర్గాన్ చేజ్, సిటీగ్రూప్, మోర్గాన్ స్టాన్లీలను నియమించుకున్నట్టు చెప్తున్నారు. అయితే కంపెనీ వర్గాలు మాత్రం దీనిపై స్పందించడం లేదు.
ఇక ఈ వాల్‌మార్ట్ గ్రూప్ సంస్థ చివరిసారిగా రూ.7,021 కోట్ల నిధులను సమీకరించింది. అప్పుడు రూ.లక్ష కోట్లుగా సంస్థ విలువను లెక్కగట్టారు. 2016లో ఫోన్‌పే మొదలైంది. అప్పట్నుంచి ఇప్పటిదాకా రూ.18,000 కోట్ల నిధులను సేకరించినట్టు తెలుస్తున్నది. 61 కోట్లకుపైగా నమోదిత యూజర్లు, 4 కోట్లకుపైగా వ్యాపారులు దీన్ని వినియోగిస్తున్నారు. 2023-24లో సంస్థ ఏకీకృత నికర లాభం రూ.197 కోట్లుగా ఉన్నది. ఆదాయం రూ.5,064 కోట్లుగా నమోదైంది.