న్యూఢిల్లీ : పన్నుచెల్లింపుదారులు తమ వార్షికాదాయాన్ని లెక్కగట్టి ఇన్‌కం ట్యాక్స్ రిటన్స్ (ఐటీఆర్) ఫైల్ చేసే బిజీలో తలమునకలవుతున్నారు. 2022-23 ఆర్ధిక సంవత్సరానికి ఐటీ రిటన్స్‌ను దాకలు చేసేందుకు ఈనెల 31 తుది గడువు. ఐటీఆర్ దాఖలు చేసేందుకు డెడ్‌లైన్‌ను పొడిగించేది లేదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఆదాయ పన్ను చెల్లింపులో సహకరించేలా భారత డిజిటల్ పేమెంట్స్ కంపెనీ ఫోన్‌పే ( PhonePe) ఇన్‌కం ట్యాక్స్ పేమెంట్ పేరుతో న్యూ ఫీచర్‌ను తన యాప్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది.
న్యూ ఫీచర్ వ్యక్తులతో పాటు వ్యాపారవేత్తలు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవడంతో పాటు నేరుగా తమ ఫోన్‌పే యాప్ నుంచి అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించే వెసులుబాటు కల్పిస్తుంది. దీంతో ట్యాక్స్ పోర్టల్‌లోకి లాగిన్ కావాల్సిన అవసరం లేదని ఫోన్‌పే పేర్కొంది. ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు బీటూబీ పేమెంట్స్, సర్వీస్ ప్రొవైడర్ పేమేట్తో ఫోన్‌పే ఒప్పందం చేసుకుంది. ఈ ఫీచర్‌తో యూజర్లు తమ క్రెడిట్ కార్డు ఉపయోగించడం ద్వారా లేదా యూపీఐ ద్వారా నేరుగా యాప్ నుంచే ఆదాయ పన్ను చెల్లించవచ్చు.
ఈ ఫీచర్ ద్వారా క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ కోసం 45 రోజుల వడ్డీ రహిత పీరియడ్, రివార్డు పాయింట్లు ఆర్జించడం వంటి పలు బెనిఫిట్స్ యూజర్లకు ఆఫర్ చేస్తున్నారు. అయితే ఫోన్‌పే యూజర్లు నేరుగా పన్ను చెల్లించకలిగినా ఐటీ రిటన్స్ మాత్రం యాప్ నుంచి ఫైల్ చేసే వెసులుబాటు లేదు. రిటన్స్ నేరుగా యూజర్లు ఫైల్ చేయాల్సి ఉంటుంది. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఫోన్‌పే ఎప్పటికప్పుడు కస్టమర్లకు అనుగుణంగా సేవలు అందించేందుకు కట్టుబడి ఉందని ఫోన్‌పేలో బిల్ పేమెంట్స్, రీచార్జ్ బిజినెస్ హెడ్ నీహారిక సైగల్ పేర్కొన్నారు.
ఇక ఫోన్‌పే నుంచి ఆదాయ పన్ను ఎలా చెల్లించాలంటే ముందుగా మీ ఐఫోన్ లేదా అండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఫోన్‌పే యాప్‌ను ఓపెన్ చేయాలి. ఆపై హోంపేజ్‌లో ఇన్‌కంట్యాక్స్ ఐకాన్‌ను క్లిక్ చేయాలి. నెక్ట్స్ మీరు చెల్లించదలుచుకున్న ట్యాక్స్ సెలెక్ట్ చేసుకుని, అసెస్మెంట్ ఇయర్, పాన్ కార్డ్ వివరాలను ఎంటర్ చేయాలి. చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని ఎంటర్ చేసి ఏరకంగా చెల్లిస్తారనే పేమెంట్ మోడ్‌ను సెలక్ట్ చేసుకోవాలి. పేమెంట్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముగించిన తర్వాత రెండు పనిదినాల్లో ఈ మొత్తం ట్యాక్స్ పోర్టల్‌లో క్రెడిట్ అవుతుంది.