హైదరాబాద్, జూలై 27: రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.1,392 కోట్ల కన్సాలిటేడెడ్ లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,403 కోట్ల లాభంతో పోలిస్తే ఒక్క శాతం తగ్గినట్లు పేర్కొంది. సమీక్షకాలంలో కంపెనీ రూ. 7,673 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.6,738 కోట్ల కంటే ఇది 14 శాతం అధికం.
ఉత్తర అమెరికా కీలకం
కంపెనీ అంచనాలకుమించి రాణించడానికి ప్రధాన కారణంగా ఉత్తర అమెరికా. ఇక్కడ సంస్థ వ్యాపారం ఏడాది ప్రాతిపదికన 20 శాతం ఎగబాకి రూ.3,850 కోట్లు లభించాయి. నూతన ఔషధాలను ఇక్కడి విడుదల చేయడం, జనరిక్ వ్యాపారం వృద్ధిని నమోదు చేసుకోవడం ఇందుకు కలిసొచ్చిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. పలు ఉత్పత్తుల ధరలు తగ్గడంతో కొంతమేర ప్రభావాన్ని చూపాయి. అలాగే యూరప్ నుంచి రూ.530 కోట్లు సమకూరాయి. భారత్లో మందులను విక్రయించడంతో రూ.1,330 కోట్లు లభించాయి. ఏడాది క్రితంతో పోలిస్తే 15 శాతం వృద్ధిని కనబరిచింది. అలాగే అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి కంపెనీకి రూ.1,190 కోట్ల ఆదాయం సమకూరింది. అలాగే ఫార్మాస్యూటికల్స్ సర్వీసులు, యాక్టివ్ ఇంగ్రిడియంట్స్తో రూ.770 కోట్లు లభించాయి.