వ్యక్తిగత ఆర్థిక విశ్లేషణ అవసరం
ఈ ఏడాదిలో అప్పుడే 7 నెలలు గడిచిపోయాయి. ఈ వ్యవధిలో ఎన్నో జరిగే ఉంటాయి. ముఖ్యంగా ఆర్థిక జీవితంపై సమీక్ష అవసరం. నిరుడుతో పోల్చితే ద్రవ్యోల్బణంతో అందరి జీవితాలు ప్రభావితమైపోయాయి మరి. కాబట్టి గడిచిన కాలంపై అంతర్మథనం అవసరమే. ఇందుకోసం నాలుగు ప్రధానాంశాలున్నాయి. రాబోయే ఈ 5 నెలల భవిష్యత్తుకూ ఇవి కీలకమే.
ఆదాయం-లక్ష్యాలు
గత 7 నెలల్లో మన ఆదాయం తీరుతెన్నులను తప్పక గమనించుకోవాలి. అలాగే పెట్టుకున్న లక్ష్యాలు ఏమిటి?.. వాటిలో సాధించినవి ఏంటి?.. అన్నదీ చూసుకోవాలి. ఆదాయ మార్గాల్లో మార్పులు తెలుసుకుని.. అందుకు తగ్గట్టుగా లక్ష్యాలను కొత్తగా నిర్దేశించుకోవడానికి ఇదే సరైన సమయం. ఇల్లు, వాహన కొనుగోళ్లు, బీమా తదితర అంశాల్లో చక్కని ప్రణాళికతో ముందుకెళ్లాలి.
ఖర్చులు-కేటాయింపులు
ఈ ఏడాదిలో ఇప్పటిదాకా ఖర్చు చేసిన ప్రతీ రూపాయి లెక్క మనకు గుర్తుండకపోవచ్చు. అయితే బ్యాంక్ లావాదేవీలను (మిని స్టేట్మెంట్లు, ఆన్లైన్ స్టేట్మెంట్లు) పరిశీలిస్తే ఖర్చులపై ఓ అవగాహన వస్తుంది. దీనివల్ల అవసరానికి మించి ఎక్కడ ఖర్చు చేశామన్నదీ తెలుస్తుంది. బడ్జెట్ యాప్ వంటివీ ఇందుకు ఉపయుక్తంగా ఉంటాయి. ఇక కేటాయింపులూ ముఖ్యమే. తప్పించుకోలేని అవసరాల కోసం తెలివిగా నగదును సర్దుబాటు చేసుకోండి.
రుణాలు-పొదుపు
వడ్డీరేట్ల పెరుగుదలతో అన్ని రుణాలూ భారమైపోయాయి. ఈ రుణభారాన్ని తగ్గించుకోవడానికి ఏం చేశామన్నదీ విశ్లేషించుకోవాలి. వడ్డీరేట్ల తగ్గింపునకు బ్యాంకర్లను సంప్రదిస్తే ఉత్తమం. కొత్తగా ఏవైనా రుణాలు తీసుకున్నామా అన్నదీ చూసుకోండి. అలాగే ప్రతి ఒక్కరూ పొదుపునకూ ప్రాధాన్యం ఇవ్వాలి. మితిమీరిన క్రెడిట్ కార్డులతో ముప్పే. అనవసరంగా ఎటువంటి రుణాల జోలికి వెళ్లవద్దు.
పన్నులు-ప్రయోజనాలు
పన్నులు, వాటి ప్రయోజనాలపైనా సమీక్ష అవసరం. పన్ను ప్రయోజనాల్ని తెలుసుకుంటే ఎంతో సొమ్మును ఆదా చేసుకోవచ్చు. మనం పెట్టే చాలా ఖర్చులకు రకరకాల పన్ను మినహాయింపులుంటాయి. దీనివల్ల మన పొదుపునూ పెంచుకోవచ్చు. ఆరోగ్య బీమా, జీవిత బీమా, గృహ రుణాల చెల్లింపులు వంటివి పన్ను మినహాయింపుల్లోకే వస్తాయి.