Home Loan | సొంతింటి కల నెరవేరిన మరుక్షణం నుంచి వాయిదాల పీడకలలు కంటున్నారా? జీవితకాలం రుణపాశం బిగుసుకుపోయిందని బాధపడుతున్నారా? అసలు ఎంతో, వడ్డీ అంత కడుతున్నామని భావించి ముందుగానే రుణం తీర్చేయాలని ఆరాటపడుతున్నారా? ఇలాంటి అభిప్రాయాలతో ఉన్నట్లయితే గృహరుణంపై పూర్తి అవగాహన లేనట్లే అని భావించొచ్చు. వడ్డీ లెక్కలు నడ్డి విరిచేస్తాయన్న అపోహతో సొంతింటిని దూరం చేసుకోకండి. జయంత్ కథ చదివితే ఎందుకన్నది మీకే తెలుస్తుంది..
జయంత్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. అదే కంపెనీలో పనిచేసే కల్యాణిని పెండ్లి చేసుకున్నాడు. ఇద్దరికీ కలిసి నెలకు రెండు లక్షల వరకు ఆదాయం ఉంది. జయంత్‌కు కుటుంబ బాధ్యతలూ ఉన్నాయి. పొదుపుగా ఖర్చు చేస్తూ ఇద్దరూ రూ.15 లక్షలు కూడబెట్టారు. ఇల్లు తీసుకోవాలని అనుకున్నారు. మంచి ఏరియాలో ఒక ఫ్లాట్ చూశారు. అన్నీ కలిపి రూ.60 లక్షలు అవుతుందన్నాడు బిల్డర్. రిజిస్ట్రేషన్ అదనం. తమ బడ్జెట్లోనే దొరికిందని జయంత్, కల్యాణి ముచ్చటపడ్డారు. బయానా ఇచ్చి రుణం కోసం బ్యాంకు తలుపుతట్టారు. వాళ్ల జీతభత్యాలకు రూ.50 లక్షలు రుణం రెండు రోజుల్లో మంజూరు అవుతుందని చెప్పాడు మేనేజర్. జయంత్ ముఖం విప్పారింది. కల్యాణి కండ్లలో వెలుగు. ఇద్దరూ హ్యాపీగా ఇంటికి చేరుకున్నారు.
మర్నాడు గృహరుణం, వాయిదాల చెల్లింపు వివరాలు విడమర్చి చెప్పాడు బ్యాంకు అధికారి. రూ.50 లక్షల రుణం, 15 సంవత్సరాల కాలపరిమితి, 9 శాతం వడ్డీ ఆధారంగా రుణంపై నెలకు రూ.50,713 వాయిదా చెల్లించాల్సి వస్తుందని వివరించాడు. మస్తిష్కంలోనే లెక్కలన్నీ వేసుకున్నాడు జయంత్. అంటే రూ.50 లక్షల రుణానికి 15 ఏండ్లలో రూ.91లక్షలకుపైగా చెల్లిస్తామని అంచనావేశాడు. అంటే అసలు పోనూ రూ.41 లక్షలు అదనంగా కడతామా? అని బెంబేలెత్తిపోయాడు. నిన్నటి ఉత్సాహమంతా నీరుగారిపోయింది. కల్యాణి సంతోషమూ ఆవిరైంది. ముందుగా చెల్లిస్తే వడ్డీ భారం తగ్గుతుందా అన్నాడు జయంత్! ‘మీరు మూడేండ్ల తర్వాత రుణం పూర్తిగా చెల్లించదలిస్తే రూ.45 లక్షలు కట్టాల్సి ఉంటుంది’ అన్నాడు బ్యాంకు అధికారి. మళ్లీ హతాశుడయ్యాడు జయంత్. అంటే మూడేండ్లలో రూ.18 లక్షలు కడితే.. అసలులో తగ్గేది రూ.5 లక్షలేనా అని విస్తుపోయాడు. ‘రెండు రోజులు సమయం ఇవ్వండి’ అని బ్యాంకు నుంచి కల్యాణితో కలిసి బయటికి నడిచాడు.
‘బ్యాంకు రుణం లేనిది ఇల్లు తీసుకోలేను. అలాగని తీసుకుంటే రెట్టింపు చెల్లించాల్సి వస్తున్నది కదా!’ అని సతమతమవుతున్నాడు జయంత్. సాయంత్రం ఆఫీస్‌లో తన స్నేహితుడు సుధీర్‌తో పరిస్థితి అంతా వివరించాడు. సుధీర్ నవ్వుతూ.. ‘ఈ విషయాలేవీ తెలియకుండానే నేను లోన్ తీసుకున్నానా?’ అన్నాడు. ప్రశ్నార్థకంగా చూశాడు జయంత్. ‘వాయిదాలో ఎంతమొత్తం వడ్డీకి పోతున్నది, ఎంత అసలు తగ్గుతున్నది అని లెక్కలు వేసుకుంటే ఇల్లు కొనడానికి ధైర్యం చాలదు. పోనీ ఎవరి దగ్గరైనా రూపాయి మిత్తికి రూ.50 లక్షలు తెచ్చుకున్నావే అనుకో! నెలకు వడ్డీ ఎంత కట్టాల్సివస్తుంది’ అడిగాడు సుధీర్. రూ.50 వేలు అన్నాడు జయంత్. ‘నెలకు రూ.50 వేల చొప్పున ఎన్ని నెలలు కడుతూ పోయినా.. అసలు గోరంత కూడా తరగదు కదా!’ అని స్నేహితుడి వంక చూశాడు సుధీర్. అంతేకదా అన్నట్టుగా తలూపాడు జయంత్. ‘అదే బ్యాంకులో రుణం.. వడ్డీతోపాటు అసలు కూడా తగ్గుతూ పోతుంది. 15 సంవత్సరాలు అంటే 180 నెలలు. అసలు తగ్గే కొద్దీ వడ్డీ మొత్తమూ తగ్గుతూ వస్తుంది. మనం చెల్లించే వాయిదాలో అసలు వాటా పెరుగుతూ ఉంటుంది’ అని వివరించాడు.
ఇన్ని చెప్పినా అర్థం కానట్టుగానే ముఖం పెట్టాడు జయంత్. ‘నీ డౌట్ ఇంకా క్లియర్ కాలేదా! ఇప్పుడు నువ్వు ఉంటున్న ఇంటి అద్దె ఎంత?’ అని అడిగాడు. ‘పదహారు వేలు..’ అన్నాడు జయంత్. ‘ఇల్లు తీసుకుంటే ఆ పదహారు వేలు తప్పినట్టే కదా! అంటే నువ్వు ఎక్కువ కడుతున్నాను అని భావిస్తున్న వడ్డీ ఇంటి అద్దెకు సరిపోయినట్టే! నువ్వు లోన్ తీసుకుందాం అనుకున్నది ఐదోపదో కాదు. యాభై లక్షలు. అంతపెద్ద మొత్తం ఎవరు మాత్రం నీకు సాయం చేయగలరు. ఊళ్లో పొలం అమ్మి కట్టొచ్చు. కానీ, ఇంత చిన్న ఆస్తి కొనడానికే ఇంతలా ఇదైపోతున్నావు. ఆ ప్రాపర్టీ మళ్లీ కొనగలవా? సంవత్సరానికి 9 శాతం వడ్డీ అంటే.. నెలకు 75 పైసలు మాత్రమే! దీనికి తోడు ఆదాయపన్ను మినహాయింపులోనూ ఇంటిరుణం చూపించుకునే వెసులుబాటు ఉంది. మరేం ఆలోచించక.. గృహరుణం తీసుకో’ అని సలహా ఇచ్చాడు సుధీర్. ‘ఇంత క్లియర్‌గా చెప్పావు. మా గృహప్రవేశానికి నువ్వే ముఖ్య అతిథి’ అని బ్యాంకుకు బయల్దేరాడు జయంత్.
అత్యవసర పరిస్థితుల్లో బంగారం బ్యాంకులోపెట్టి రుణం తీసుకోవడం మామూలే! నెలకు వడ్డీ చెల్లిస్తూ ఉంటారు. అసలు చెల్లించే వరకు కుదువపెట్టిన బంగారంలో తులం గొలుసైనా ఇవ్వరు. అదే ఇంటి విషయానికి వస్తే.. బ్యాంకర్ ఇంటిపత్రాలు మాత్రమే పెట్టుకుంటాడు. ఇల్లు యజమాని అధీనంలోనే ఉంటుంది. ఇంటి అద్దె కూడా తప్పుతుంది. ఆ ఇంటిని వేరొకరికి అద్దెకు ఇచ్చుకోవచ్చు. అందుకే, గృహరుణాన్ని మంచి అప్పుగా పరిగణించాలి. తొందరపడి ప్రీక్లోజ్ చేయొద్దు. అంతగా డబ్బులు ఉన్నట్లయితే మరెక్కడైనా ఇన్వెస్ట్ చేయడం తెలివైన పని అనిపించుకుంటుంది.
– ఎం. రాం ప్రసాద్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్
ram@rpwealth.in, www.rpwealth.in
Bank Auction Property | తక్కువలో వస్తుందని వేలంలో ఇల్లు కొంటున్నారా? ఈ నష్టాల గురించీ ఆలోచించండి
Reverse Mortgage Scheme | మీ ఇంటిని అద్దెకు ఇవ్వకుండానే ఇలా నెలనెలా వేలకు వేలు పొందండి
“Home Loan on Whatsapp | హోంలోన్ కావాలా.. వాట్సాప్‌లోనే అప్లయ్ చేసుకొండిలా..!”
“Home Loan | హోమ్ లోన్ ఎక్కడ తీసుకుంటే బెటర్? బ్యాంకుల్లోనా? ఫైనాన్సియల్ కంపెనీల్లోనా?”