Bank Licence Cancel | ఆర్థిక దెబ్బ తిన్న బ్యాంకుల జాబితాలో మరో బ్యాంకు వచ్చి చేరింది. ఉత్తరప్రదేశ్‌లోని పీపుల్స్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ లైసెన్స్‌ను ఆర్బీఐ రద్దు చేసింది. బ్యాంకు ఆర్థిక పరిస్థితులు బాగా లేవని, ఆదాయం సంపాదించే అవకాశాల్లేవని పేర్కొంది. కనుక బ్యాంకు మూసివేతకు నోటీసు జారీ చేసి, లిక్విడేటర్‌ను నియమించాలని కోఆపరేటివ్ సొసైటీస్ రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. బ్యాంకు ఆర్థిక స్థితిగతులు సరిగ్గా లేనందున బిజినెస్ లావాదేవీలు జరిపేందుకు అనుమతించడం ప్రజా ప్రయోజనాలకు మంచిది కాదని పేర్కొంది.
బ్యాంకు లైసెన్స్ రద్దు చేయడంతో అందులో నగదు దాచుకున్న డిపాజిటర్లు ఆందోళనకు గురవుతున్నారు. అయితే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) యాక్ట్-1961 ప్రకారం లిక్విడేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఖాతాదారుల డిపాజిట్లు 99 శాతం చెల్లిస్తారు. ప్రతి డిపాజిటర్‌కు డీఐసీజీసీ రూ.5 లక్షల వరకు సొమ్ము చెల్లిస్తుంది. ఇందుకు అనుగుణంగా 2021 బడ్జెట్లో డీఐసీజీసీ చట్టానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సవరణలు చేసిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఏదైనీ బ్యాంక్ తన బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైతే డీఐసీజీసీ చట్టం ప్రకారం డిపాజిటర్లకు సకాలంలో రూ.5 లక్షల వరకు చెల్లింపులు జరుపుతారు.
బ్యాంకింగ్ నిర్వహణ, ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఆర్బీఐ లైసెన్స్ రద్దు చేసిన బ్యాంకుల జాబితాలో పీపుల్స్ కోఆపరేటివ్ బ్యాంక్ నాలుగవది. ఇంతకుముందు సర్జేరోదాదా నాయక్ శిరాల సహకారి బ్యాంక్, ఇండిపెండెంట్ కోఆపరేటివ్ బ్యాంక్, మంథా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్‌లను ఆర్బీఐ రద్దు చేసింది. ఈ మూడు బ్యాంకులు మహారాష్ట్రలోనివే. ఈ మూడు బ్యాంకుల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతోపాటు ఆదాయం సంపాదించుకునే పరిస్థితుల్లో లేనందున వీటి లైసెన్సులను ఆర్బీఐ రద్దు చేసింది. ఈ మూడు బ్యాంకుల్లో నగదు దాచుకున్న 99 శాతం మంది డిపాజిటర్లకు డీఐసీజీసీ.. వారి డిపాజిట్ల ప్రకారం నగదు చెల్లించనున్నదని ఆర్బీఐ తెలిపింది.