న్యూఢిల్లీ, మార్చి 8: న్యూటెక్ స్టార్టప్‌లైన ఇంటర్నెట్ కంపెనీల ఐపీవోల్లో పెట్టుబడి చేసేందుకు ఇన్వెస్టర్లు ఎదురుచూసినంత కాలం పట్టలేదు..అవి పతనంకావడానికి. గత ఐదారు నెలల్లో లిస్టయిన న్యూఏజ్ టెక్నాలజీ కంపెనీల షేర్లు అంతకంతకూ పడిపోతూ, వాటి ఐపీవోల్లో మదుపుచేసిన ఇన్వెస్టర్లకు భారీ నష్టాల్ని మిగిల్చాయి. జొమాటో, పేటీఎం, నైకా, పాలసీ బజార్- ఈ నాలుగు కంపెనీలు ఇప్పటివరకూ రూ. 1.44 లక్షల కోట్లకుపైగా ఇన్వెస్టర్ల సంపదను నష్టపర్చాయి. లిస్టింగ్ రోజున ఈ నాలుగు కంపెనీల మార్కెట్ విలువ రూ.3.58 లక్షల కోట్లుకాగా, ప్రస్తుతం ఇది రూ.2.14 లక్షల కోట్లకు తగ్గింది. ఇందులో ఇన్వెస్టర్ల సంపదను అధికంగా హరించిన కంపెనీ పేమెంట్ ప్లాట్‌ఫామ్ పేటీఎంను నిర్వహించే 97 కమ్యూనికేషన్స్. ఇది షేరుకు రూ.2,150 ధరతో పబ్లిక్ ఆఫర్ జారీచేయగా, ఆఫర్ ధరకంటే తక్కువగా రూ.1,955 వద్ద ఇది లిస్టయ్యింది. మంగళవారం ఈ షేరు రికార్డు కనిష్ఠ స్థాయి రూ.737 వద్దకు పడిపోయింది. ఐపీవో ధర వద్ద ఈ కంపెనీ విలువ రూ.1.39 లక్షల కోట్లుకాగా, లిస్టింగ్ రోజైన 2021 నవంబర్ 18న రూ.1.01 లక్షల కోట్ల మార్కెట్ విలువ నమోదయ్యింది. ఇప్పటి నుంచి ఈ మూడున్నర నెలల్లో మరో రూ.60 వేల కోట్ల సంపదను ఇన్వెస్టర్లు నష్టపోయారు. ప్రస్తుతం దాని మార్కెట్ విలువ రూ. 50,899 కోట్లే.
మురిపించి, ముంచేసిన జొమాటో
ఐపీవోలో ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందనను పొంది, ఆఫర్ ధరతో భారీ ప్రీమియంతో లిస్టయిన ఫుడ్ ఆగ్రిగేటర్ జొమాటో సైతం ఇన్వెస్టర్లను తీవ్రంగా నిరాశపర్చింది. రూ.76 ధరకు ఐపీవో జారీచేసిన ఈ సంస్థ షేరు గతేడాది జూలై 23న రూ.116 వద్ద లిస్టయి, తదుపరి కొద్దిరోజుల్లో రూ.169 ఆల్‌టైమ్ గరిష్ఠస్థాయికి చేరింది. లిస్టింగ్ రోజున జొమాటో విలువ రూ.98,731 కోట్లుకాగా, ఆ రోజు విలువ నుంచి ఇన్వెస్టర్లను రూ.34,024 కోట్లు నష్టపర్చింది. దాని మార్కెట్ విలువ రూ. 63,133 కోట్లకు తగ్గింది. అయితే తాజా ముగింపు ధర రూ.78తో పోలిస్తే ఐపీవోలో పెట్టుబడి చేసిన ఇన్వెస్టర్లు అధిక ధరలో విక్రయించుకునే ఛాన్స్‌ను ఉపయోగించుకోకపోయినట్లయితే, వారి పెట్టుబడి ప్రస్తుతానికి సురక్షితంగా ఉన్నట్టు లెక్క. ఫ్యాషన్ ఉత్పత్తుల ఇంటర్నెట్ బ్రాండ్ నైకాను నిర్వహించే ఎఫ్ఎస్ఎన్ ఈ కామర్స్ వెంచర్స్దీ ఇదే తీరు. ఇది లిస్టయిన 2022 నవంబర్ 10న రూ.1,04,361 కోట్ల మార్కెట్ విలువను సాధించగా, ఇప్పుడది కాస్తా రూ.71,561 కోట్లకు తగ్గింది. గతేడాది నవంబర్ 15న లిస్టయిన పాలసీ బజార్ (పీబీ ఫిన్‌టెక్) ఇన్వెస్టర్లకు రూ. 24,420కోట్ల నష్టాన్ని మిగిల్చింది. లిస్టింగ్ రోజున రూ.54,070 కోట్లుగా ఉన్న దీని మార్కెట్ విలువ రూ.29,458 కోట్లకు పడిపోయింది.