Paytm | ప్రముఖ ఆన్లైన్ పేమెంట్స్ సంస్థ పేటీఎం సేవల విస్తరణకు మార్గం సుగమం అయ్యింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు ఇక నుంచి షెడ్యూల్ పేమెంట్స్ బ్యాంక్ హోదా కల్పిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ సంగతిని పేటీఎం గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. 2017లో పేటీఎం పేమెంట్ బ్యాంక్‌ను ప్రారంభించింది. ఆర్బీఐ తాజాగా తీసుకున్న నిర్ణయంతో పేటీఎం ఇతర వ్యాపారాలపై దృష్టి పెట్టడానికి వీలు కలుగుతుంది. కేంద్ర ప్రభుత్వంతోపాటు కార్పొరేట్ కంపెనీలు జారీ చేసే రిక్వెస్ట్ ఆఫ్ ప్రపోజల్స్ (ఆర్ఎఫ్పీ)ల్లో పాల్గొనే వీలు కలుగుతుంది.
దీంతోపాటు ప్రైమరీ వేలంలోనూ పాల్గొనే చాన్స్.. పేటీఎంకు లభిస్తుంది. పేటీఎంకు షెడ్యుల్ బ్యాంక్ స్టేటస్ కల్పించాలని గత సెప్టెంబర్‌లోనే ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు పేటీఎంకు షెడ్యూల్ బ్యాంక్ స్టేటస్ కల్పిస్తున్నట్లు గత అక్టోబర్‌లో నోటిఫికేషన్ జారీ చేసింది. షెడ్యూల్ బ్యాంక్‌గా ఇతర షెడ్యూల్ బ్యాంకుల నిబంధనలు, సంప్రదాయాలు పాటించాలి. ఆర్బీఐ నుంచి రుణం కూడా పొందొచ్చు. గత మార్చి నెలాఖరు నాటికి పేటీఎంకు 6.4 కోట్ల సేవింగ్స్ ఖాతాలు ఉన్నాయి.